
తెలంగాణ సాహితీ సౌరభాలను వెండితెరపై పరిమళింపజేస్తాం
యాదగిరిగుట్ట : మరుగున పడిపోయిన తెలంగాణ సాహితీ సౌరభాలను వెండితెరపై పరిమళింపజేసేందుకు కృషి చేస్తున్నామని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. బుధవారం ఆయన యాదగిరిగుట్టలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతను కలిశారు. ఈ సందర్భంగా ఆయన తన మనసులోని భావాలను ప్రత్యేకంగా పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...
సినిమా శక్తివంతమైన ప్రచార సాధనం..
తెలంగాణలో అద్భుత సాహిత్య సంపద ఉంది. పుస్తకాల రూపంలో కొందరికే అందుబాటులో ఉన్న సాహిత్య సంపదను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం జరగాలి. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఈ తరుణంలో తెలంగాణ సాహిత్యం, కళారూపాలు, తెలంగాణ భాష, యాస, సంస్కృతికి పెద్దపీట వేయాలి. వీటికి తగిన వేదిక సినిమానే. సినిమా చాలా శక్తివంతమైన ప్రచార సాధనం. ఇది సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు అందుబాటులో ఉంటుంది. సినిమా ద్వారా తెలంగాణ సాహిత్యం, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పవచ్చు. ఇందు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం కూడా తీసుకుంటున్నాం.
తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించాలి..
సినిమా కథలు, పాటలలో తెలంగాణ భాష, యాస, సాహిత్యాన్ని గౌరవప్రదంగా చూపించాలి. అలాగే ఈ ప్రాంతంలో అనేక వీరోచిత గాధలు, సాంఘిక, పౌరాణిక కథలు ఉన్నాయి. వాటిని వెండి తెరపై ఆవి ష్కరించాల్సి ఉంది.
రాయితీలు కల్పిం చాలి..
తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయాలి. పెద్ద ఎత్తున నిధులు, రాయితీలు కల్పించాలి. అలాగే 24 క్రాఫ్ట్స్‌ల తెలంగాణ సినీ కళాకారులు పరిశ్రమ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయాలి.
అవకాశం కోసం ఎదురు చూస్తున్నా..
నేను ఇప్పటి వరకు రాసిన పాటలు ఎంతగానో సంతృప్తినిచ్చాయి. జాతీయ అవార్డు రావడం జీవితంలో మరిచిపోలేని ఘట్టం. చరిత్రలో నిలిచిపోయేలా సినిమాలకు సాహిత్యం అందించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నా. ముఖ్యంగా జిల్లావాసినైనందున ఈ ప్రాంత చరిత్ర, ఇక్కడి సాహిత్యాన్ని వెండితెరపై ఆవిష్కరించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.. అలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నా.. తప్పకుండా ఈ ప్రాంత చరిత్ర, గొప్పదనాన్ని ఏదో ఒక సినిమాలో సాహిత్య, దృశ్య రూపంలో చూపించేందుకు కృషి చేస్తా.