కంతనపల్లి కధ కంచికే.. | Sue construction companies | Sakshi
Sakshi News home page

కంతనపల్లి కధ కంచికే..

Published Mon, Mar 21 2016 3:03 AM | Last Updated on Tue, Mar 19 2019 6:15 PM

Sue construction companies

తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణం
 
అంచనా విలువ రూ.2,200 కోట్లు
{పభుత్వానికి డీపీఆర్ సమర్పణ
రుత్విక్-స్యూ కంపెనీలకే నిర్మాణ పనులు
పూర్తయితేనే దేవాదుల ఆయకట్టుకు భరోసా

 
వరంగల్ : గోదావరి నదిపై ఏటూరునాగారం మండలంలోని కంతనపల్లి వద్ద నిర్మించ తలపెట్టిన పి.వి.నర్సింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు కథ కంచికి చేరింది. ఈ ప్రాజెక్టు స్థానంలో తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మించేందుకు వ్యాప్కోస్ సర్వే సంస్థ రూపొందించిన డీపీఆర్ (డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. ఈ బ్యారేజీ నిర్మాణానికి రూ.2200 కోట్ల్లు అవుతుందని అంచనాలు రూపొందించారు. ప్రభుత్వం గోదావరి నదిపై వరుస బ్యారేజీలు  నిర్మించేందుకు ఉత్సాహం చూపుతున్నందున దీనికి నెలరోజుల్లో పరిపాలన మంజూరు వస్తుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వం కంతనపల్లి ప్రాజెక్టు నిలిపివేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో సుమారు 10వేల ఎకరాలు ముంపునకు గురికావడమే కాకుండా పక్క రాష్ట్రాలతో సమస్యలు తలెత్తనున్నాయి. దీనికి తోడుగా ఆటవీ గ్రామాలు ముంపునకు గురికావడంపై ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి.

ఈ విషయాలను  పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు.. అటవీ భూముల ముంపు లేకుండా, అంతరాష్ట్ర సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా ప్రాజెక్టులకు రీడిజైన్ చేయించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల స్థానంలో గోదావరిపై వరుస బ్యారేజీలను నిర్మించాలని సాగునీటి శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఈ వరస బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలు, నీటి లభ్యత, భూముల ముంపు తదితర అంశాలపై సాగునీటి ప్రాజెక్టులపై సర్వే నిర్వహించే సంస్థ తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణంపై పూర్తి డీపీఆర్‌ను రూపొందించింది. ఈడీపీఆర్‌ను పరిశీలించిన సాగునీటి శాఖ ఉన్నతాధికారులు కొన్ని చిన్న మార్పులు చేసి ప్రభుత్వానికి సమర్పించారు.
 
బ్యారేజీ నిర్మాణానికి రూ.2200కోట్లు

 తుపాకులగూడెం వద్ద బ్యారేజీని 80-88 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు రూ.2340 కోట్ల వ్యయం అవతుందని అంచనాలు రూపొందించారు. ఈ బ్యారేజీ డీపీఆర్‌ను పరిశీలించిన నిపుణుల కమిటీ.. 83 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే చత్తీస్‌గఢ్‌తో పాటు మన ప్రాంతాల్లో ఏ ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికాదని నిర్ధారించారు. ఈ ఎత్తుతో నిర్మిస్తే దేవాదుల ఎత్తిపోతల పథకం ఇంటేక్‌వెల్ వద్ద నీరు 73మీటర్ల ఎత్తుతో ప్రవహిస్తుందని వ్యాప్కోస్ సంస్థ రిపోర్టులో పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల దిగువ ఈ బ్యారేజీ నిర్మిస్తున్నందున ఇరుపక్కలా తెలంగాణ రాష్ట్రం పరిధి కావడం కలిసివచ్చే అంశం. 83 మీటర్ల ఎత్తుతో రూ.2200 కోట్ల వ్యయంతో బ్యారేజీని నిర్మించనున్నారు. బ్యారేజీ నుంచి దేవాదుల ఇన్‌టేక్ వెల్ వరకు సుమారు 6.90 టీఎంసీల నీరు ఎల్లప్పుడూ నిల్వ ఉంటుంది. నిత్యం ప్రవహిస్తున్న నీటిని ప్రతిరోజూ 2600క్యూసెక్కులను ఏడాది పాటు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ఎత్తిపోసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తె లిపారు.

 కంతనపల్లి ఏజెన్సీకే బ్యారేజీ పనులు
 కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేస్తున్నందున దాని స్థానంలో నిర్మించ తలపెట్టిన తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులను పాత కాంట్రాక్టర్‌కే అప్పగించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కంతనపల్లి పనులను రుత్విక్-స్యూ కంపెనీలు జాయింట్ వెంచర్‌గా దక్కించుకున్నాయి. అన్ని అనుమతులు రావడంతో ప్రాజెక్టు నిర్మాణంలో ఉపయోగించే పరికరాలను, సామగ్రిని సైట్‌లోకి తరలించింది. ఇప్పుడు అర్ధాంతరంగా ప్రాజెక్టు పనులు నిలిపివేసినందున కాంట్రాక్టర్‌కు పెద్దఎత్తున నష్ట పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. బ్యారేజీ పనులను తమకు అప్పగిస్తే నిర్మిస్తామని రుత్విక్-స్యూ కంపెనీలు ముందుకు రావడంతో ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు తెలిసింది.

 తాత్కాలిక అనుమతులతో నిర్మాణం ప్రారంభం
 తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మించేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇస్తే వెంటనే పనులు ప్రారంభించేందుకు ఇరిగేషన్ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ బ్యారేజీ నిర్మాణంలో అంతరాష్ట్ర ఇబ్బందులు, అటవీ ప్రాంతం, నివాస స్థలాలు, సాగుభూములు, గ్రామాలు ముంపునకు గురికాకపోవడం, పర్యావరణ ఇబ్బందులు లేక పోవడం వల్ల తాత్కాలికంగా కేంద్రం నుంచి నిర్మాణ అనుమతి పొందేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కేటాయింపుతో పరిపాలన అనుమతి ఇస్తే ఈ వేసవి కాలంలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement