నల్లగొండ : తలకు టవల్ కట్టుకుని వెళ్తున్న మహిళలు ,గొడుగు పెట్టుకుని వెళ్తున్న యువతులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : కొద్ది రోజులుగా జిల్లాలో ఎండలు పెరిగిపోయాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నల్లగొండలోనే అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెండేళ్ల కిందట 2016 ఏప్రిల్ 25వ తేదీన జిల్లాలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్టోగ్రత నమోదు కాగా, ప్రస్తుతం కూడా అదే పరిస్థితి జిల్లా ప్రజలను భయానికి గురిచేస్తోంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో తారు, సిమెంటు రోడ్లు వేడి తీవ్రతను మరింతపెంచుతున్నాయి. గడిచిన వారం రోజులుగా జిల్లాలో 42 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండాకాలం మరో రెండు నెలల మిగిలి ఉంది. సీజన్ మొదలైన కొద్ది రోజులకే ఎండలు తీవ్రం కావడంతో ముందు ముందు ఎలా గడుస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలు, ఇతరత్రా వ్యవసాయ కూలీలు తెల్లవారు జామునే పనుల్లోకి వెళ్లి పదిగంటల కల్లా తిరుగు ముఖం పడుతున్నారు. సాయంత్రం చల్లబడితే తప్ప తిరిగి పనికి వెళ్లడం లేదు. పట్టణాల్లో భవన నిర్మాణ కార్మికులదీ అదే పరిస్థితి. ఉదయం తొమ్మిది దాటితే పనులు చేయలేకపోతున్నారు. ఇంత తీవ్రంగా ఎండలు మండిపోతుండడంతో వడదెబ్బ కొట్టే ముప్పు బాగా పెరిగినట్లేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకుని ఎండలో తిరగకుండా చల్లపూటే పనులు చేసుకోవడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నాలుగు లక్షల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సిద్ధం చేసింది. ఇందులో ఇప్పటికే 2 లక్షల ప్యాకెట్లను పంపిణీ కూడా చేసింది. వడదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో ప్రజల్లో చైతన్యం కల్పించే కార్యక్రమాలు షురూ చేసింది. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సైతం ప్రజలు నిత్యం వెళ్లే రేషన్ షాపులు, అంగన్‌వాడీ కేంద్రాలు తదితర ప్రాంతాల్లో అందుబాటులో ఉంచింది.
వారం రోజులుగా మండుతున్న ఎండ
ఈ నెలారంభం నుంచే ఎండల కొద్దిగా భయపెడుతున్నా వారం రోజులుగా మరీ ఎక్కువయ్యాయి. మధ్యలో అకాల వర్షంతో ఉష్ణోగ్రతలు కొంత అదుపులోకి వచ్చి తగ్గిన ట్లు కనిపించినా, గడిచిన వారం నంచి ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
ఇవీ.. వడదెబ్బ లక్షణాలు
ఎండలో తిరిగినా, పనిచేసినా శరీరంలోని ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థ దెబ్బతినడంతో వడదెబ్బకు గురవుతారు. శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీల నుంచి 110 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు పెరుగుతుంది. వడదెబ్బ బాధితుల్లో 40శాతం వరకు మరణించే అవకాశాలు ఉంటాయి. వడదెబ్బకు గురైన వ్యక్తికి తలతిరగడం, తలనొప్పి, చర్మం ఎండిపోయి ఎక్కువ జ్వరం కలిగి ఉంటారు. మగతగా కలవరించడం, ఫిట్స్ రావడం, పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళతారు.
వడదెబ్బ నుంచి రక్షణ ఇలా..
గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక రోగులు ఎట్టి పరిస్థితులలో ఎండలో తిరగరాదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నీడలో ఉంటే మంచిది. ఎండ తీవ్రత ఉన్నప్పుడు వ్యాయామం చేయడం కూడా ప్రమాదకరం. సాధ్యమైనంత వరకు మిట్టమధ్యాహ్నం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి. తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే టోపీ ధరించాలి లేదంటే రుమాలు చుట్టుకోవాలి. ముక్కుకు, తలకు ఎండ తగలకుండా చూసుకోవాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, పళ్ళ రసాలు తాగి వెళ్లాలి. సాధ్యమైనంత వరకు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. లేత రంగు, కాటన్ దుస్తులను ధరించాలి. ఇంటి గదుల్లో ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. వడదెబ్బకు గురైన వ్యక్తి శరీరాన్ని వెంటనే చల్లటి గుడ్డతో చల్లబర్చాలి. చల్లని నీడ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి శరీరంపై ఉన్న దుస్తులను తొలగించి చల్లని నీటితో లేదా, చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. చల్లని గాలి తగిలేలా ఉంచి చల్లని ఉప్పు కలిగిన నీటిని తాగించాలి. వడదెబ్బకు గురైన వ్యక్తిని ఎలాంటి ఆలస్యం చేయకుండా దగ్గరిలోని వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని ముందుస్తు జాగ్రత్తలను తీసుకున్నాం. ప్రజలు వడదెబ్బ భారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికి కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్ల ఏర్పాటుతో ప్రచారం చేస్తున్నాం. ఆశా కార్యకర్తల మొదలు వైద్యాధికారులందరినీ అప్రమత్తం చేశాం. జిల్లాలో 4లక్షల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సిద్ధం చేడయంతో పాటు ఇప్పటికే 2లక్షల ప్యాకెట్లను పంపిణీ చేశాం. అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలు, పనికి ఆహార పథకం పనుల వద్ద, బస్టాండ్లు, రైల్వేస్లేషన్ల వద్ద జనానికి అందుబాటులో ఉంచాం. సీజన్‌లో అవసరమైన మందులను అన్ని ఆస్పత్రుల్లో , పీహెచ్‌సీల్లో సిద్ధంగా ఉంచాం. ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశాం. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.– డాక్టర్ భానుప్రసాద్ నాయక్, డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment