మార్చి మాసం ముగియుకుండానే భానుడి భగ భగలు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో మండే ఎండలు, వేడిగాలులు తట్టుకొని నిలబడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే వేసవిలో వడ దెబ్బ ప్రమాదం పెరుగుతుంది. మరి వడదెబ్బ, ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఎండలు రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో పిల్లా పెద్దా అంతా అప్రతమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా, నీరు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాదు బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి రక్షణ లేకుండా వెళ్లవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సాధ్యమైనంత ఎక్కువ నీరు తాగాలి. వీటితోపాటు రకరకాల ద్రవపదార్థాలు, పానీయాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యాన్నిచ్చే వివిధరకాల తాజా పండ్ల రసాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పెరుగు, మజ్జిగ, సీజనల్ పండ్లు, ద్రాక్ష, బొప్పాయి వంటివి ఈ సీజన్‌లో తీసుకోవడం మేలు చేస్తుంది. అతిగా ఆహారం తీసుకోవడం హానికరం. నీటిని ఎక్కువగా వాడాలి.దాహంగా ఉంది కదా అని రసాయన సహిత కూల్ డ్రింక్స్, శుభ్రమైన ఐస్ వాడని డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ తినకూడదు. ఫాస్ట్ ఫుడ్, బయటి ఆహారానికి దూరంగా ఉండాలి.
పిల్లలు, వృద్ధులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె జబ్బులతో బాధపడేవారు, శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ఎండలోకి వెళ్లకుండా చూడాలి. తప్పదు అనుకుంటే, ఎండను తట్టుకునేలా తలపై టోపీ లేదా గొడుగు వాడాలి.
బార్లీని నీటిలో నాన బెట్టి మరిగించి తయారు చేసిన నీళ్లు తాగితే వడదెబ్బ తగలదు. ఉల్లి పాయ రసం తాగితే వడదెబ్బ తగలకుడా చేస్తుంది. దీనితో పాటు, ఉల్లిపాయ రసాన్ని అరికాళ్ళపై పూయడం కూడా మంచిదే. చెమటలు పట్టేటప్పుడు చల్లటి నీరు ఎక్కువగా తాగడం ప్రమాదకరం. అలాగే ఎండలోంచి లోపలికి వచ్చిన వెంటనే గట గటా చల్లని నీళ్లు తాగకూడదు.
ఒకవేళ ఏదైనా అనారోగ్యంగా అనిపించినా, వాంతులు, కళ్లు తిరగడం, తలనొప్పి, విరేచనాలు లాంటి లక్షణాలు కనిపించినా, వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. తక్షణమే చికిత్స తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment