సునీతారెడ్డికి డీసీసీ పగ్గాలు
నేడు అధికారికంగా అందనున్న ఉత్తర్వులు
నర్సాపూర్: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలిగా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వాటికి సునీతారెడ్డి ఎన్నికయ్యారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాలతో తెలంగాణ పీసీసీ ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ సూచనల మేరకు తెలంగాణ పీసీసీ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. శుక్రవారం టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సునీతారెడ్డి పేరును అధికారికంగా ప్రకటించడంతో పాటు ఆమెకు నియామక ఉత్తర్వులు అందివ్వనున్నారు.
మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికలకు ముందు డీసీసీ అధ్యక్షునిగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ప్రకటించిన టీపీసీసీ ఒక్కరోజులోనే ఆయన నియామకాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా, సునీతారెడ్డికి డీసీసీ పగ్గాలు దక్కనుండడం పట్ల టీపీసీసీ అధికార ప్రతినిధి, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
అనూహ్యంగా వచ్చి... హ్యాట్రిక్ సాధించి
శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన వాకిటి సునీతారెడ్డి 1999 సంవత్సరంలో భర్త లకా్ష్మరెడ్డి అకాల మృతితో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి చిలుముల విఠల్‌రెడ్డిపై విజయం సాధించారు. ఆతర్వాత వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. అయితే ఇటీవల జరిగిన 2014 సాధారణ ఎన్నికల్లో ఆమె ఓటమి చవిచూశారు. ఆ తర్వాత మెదక్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసిన సునీతారెడ్డి రెండోస్థానంలో నిలిచారు.
జెడ్పీపై కాంగ్రెస్ జెండా పాతిన సునీతారెడ్డి
సునీతారెడ్డి 1999లో ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం 2000 సంవత్సరంలో జిల్లా డీసీసీ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. సుమారు 16 నెలల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆమె, ఆ సమయంలో జిల్లాలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక స్థానాలు కైవసం చేసుకుని జెడ్పీ పీఠం దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం పీసీసీ సభ్యురాలిగా, ఏఐసీసీ సభ్యురాలిగా కొనసాగుతున్న సునీతారెడ్డి గతంలో పీసీసీ మహిళా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. సమైక్య రాష్ట్రంలో ఐదేళ్లపాటు మంత్రిగా కొనసాగారు.
పార్టీ బలోపేతమే లక్ష్యం
జిల్లాలో పార్టీని బలోపేతం చేయడమే నా ముందున్న ప్రస్తుత లక్ష్యం. జిల్లాలోని నాయకులందరి సహకారంతో పార్టీని ముందుకు తీసుకువెళ్తా. కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ శ్రేయస్సుకోసం పనిచేస్తా. టీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలన్నీ స్వాగతిస్తాం. కానీ ప్రజావ్యతిరేక విధానాలను మాత్రం పార్టీ తరఫున అడ్డుకుంటాం. చివరగా నన్ను డీసీసీ అధ్యక్షురాలిగా ప్రతిపాదించిన వారందరికీ ధన్యవాదాలు.
-సునీతారెడ్డి, మాజీమంత్రి