
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో అన్ని పార్టీలు తమకు అన్యాయం చేశాయని భావించిన బీసీ నాయకులు రానున్న ఎన్నికల్లో తమ ఓటు తామే వేసుకోవాలన్న పిలుపుతో ప్రజా జేఏసీగా ఏర్పడ్డారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడలో జరిగిన సమావేశంలో జస్టిస్ ఈశ్వరయ్య అధ్యక్షతన ప్రజా జేఏసీ ఏర్పడింది. బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించే పార్టీకే మద్దతివ్వాలని బీసీ నాయకులు తీర్మానించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ.. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా వెనుకబడినందుకే చట్టసభల్లో సముచిత స్థానం పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి రాజకీయ నాయకులు మోసపూరితమైన వాగ్దానాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి మాటలకు విలువలు లేకపోవడం దీనికి నిదర్శనమన్నారు. ఒకరిని మరొకరు దూషించుకోవడం వల్ల పారదర్శకత లోపిం చిందన్నారు. దేశంలో నాణ్యమైన విద్య, వైద్యం కొరతతో అభివృద్ధి కుంటుపడిందని, కాబట్టి విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 36 స్థానాల్లోనే బీసీ అభ్యర్థులు పోటీపడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. మన ఓటు మన బీసీలకు వేసి గెలిపించుకుని చట్ట సభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించుకోవడం వల్ల మన సంక్షేమానికి పునాదులు వేసుకున్న వారమవుతామని ఈశ్వరయ్య అన్నారు. గతం ప్రభుత్వాలు కులవృత్తులు, చేతివృత్తుల వారి అభివృద్ధిని నీరుగార్చాయని ప్రొఫెసర్ తిరుమలి అన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ స్థానాల్లో గెలిచిన అభ్యర్థులు అగ్రకులాల నాయకులకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. రాష్ట్రంలో దోపిడికి గురవుతున్న ఏౖకైక వర్గం బీసీలేనన్నారు. సామాజిక న్యాయమే ధ్యేయంగా విలువలతో కూడిన నాయకులను గెలిపించుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, కస్తూరి జయప్రసాద్, ప్రొఫెసర్ మురళీమనోహర్, జేబీ రాజు, పీఎస్‌ఎన్‌వీ మూర్తి, టీవీ రామ నర్సయ్య, నర్సింహ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment