పాలమూరు-డిండిపై సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: పాలమూరు-డిండి ప్రాజెక్టుల నిర్మాణంపై గుంటూరుకు చెందిన రైతులు వేసిన కేసును సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ఎలాంటి అనుమతులు, డీపీఆర్ లేకుండా ప్రాజెక్టులను నిర్మిస్తున్నారనే రైతుల వాదనలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. డీపీఆర్ లేకుండా తెలంగాణ ప్రాజెక్టును నిర్మించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అభ్యంతరం తెలిపింది. దానిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం రైతులు, ఏపీ ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చింది.
ఈ పిటిషన్ విచారణను అనర్హం అని పేర్కొంది. పాలమూరు-డిండి ప్రాజెక్టులు కొత్తవి కాదని, ఉమ్మడి రాష్ట్రంలోనే వాటి నిర్మాణానికి ఆమోదాలు పూర్తయ్యాయని తెలిపింది. అంతరాష్ట్ర జలవివాదాల్లో వ్యక్తిగత పిటిషన్లు చెల్లవని పేర్కొంది. ఇరువర్గాల వాదోపవాదనలు విన్న సుప్రీంకోర్టు వీలైనంత త్వరగా పిటిషనర్ల అభ్యంతరాలను పరిశీలించాలని అపెక్స్ కౌన్సిల్ కు సూచనలు చేసింది.