న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కేసుల దర్యాప్తులో జాప్యాన్ని తప్పుపడుతూ సీబీఐ, ఈడీలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2జీ, అందులో భాగమైన ఎయిర్‌సెల్–మాక్సిస్ ఒప్పందంలో అవకతవకలపై దర్యాప్తును ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ముఖ్యమైన ఇలాంటి కేసుల్లో ప్రజలకు వాస్తవాలు తెలియకుండా దాచిపెట్టకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. ‘2జీ స్పెక్ట్రం, అనుబంధ కేసుల్లో దర్యాప్తు ముగించేందుకు ఎందుకింత జాప్యం జరుగుతోంది. 2010లో సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది.
ఇంతవరకూ ఎందుకు విచారణ పూర్తి చేయలేదో చెప్పండి’ అని నిలదీసింది. కేసు దర్యాప్తు జాప్యం వెనుక ఏదైనా అదృశ్య శక్తి హస్తముందా? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. ‘ ఈ కేసుతో సంబంధమున్న అందరిపై కేసులు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ జరపండి. దర్యాప్తు తీరుపై అసంతృప్తిగా ఉన్నాం’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై అటార్నీ జనరల్ వేణుగోపాల్ స్పందిస్తూ.. ‘టెలికం మాజీ మంత్రి రాజాకి ప్రమేయమున్న 2జీ కేసులో నిందితుల్ని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
అదేవిధంగా ఇతర అనుబంధ కేసుల్లో నిందితులపై ఆరోపణల్ని కూడా కొట్టివేశారు. కేవలం మలేసియా వ్యాపారవేత్త టీ ఆనంద కృష్ణన్‌కు ప్రమేయమున్న ఎయిర్‌సెల్–మాక్సిస్ కేసు దర్యాప్తు మాత్రమే పెండింగ్‌లో ఉంది. అతను మలేసియాలో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో అతన్ని భారత్‌కు రప్పించలేకపోయాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుంటూ... కేసు దర్యాప్తు పురోగతిపై రెండు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఆదేశించింది.
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వాదిస్తూ.. ఎయిర్‌సెల్–మాక్సిస్ కేసు దర్యాప్తుపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఇంతకముందే కోర్టు ఆదేశించిందని, అయితే కేసులోని ఒక నిందితుడి బెడ్‌రూంలో ఆ ఫైల్ ఉందని ఆరోపించారు. ఎయిర్‌సెల్–మాక్సిస్ కేసు నుంచి దయానిధి మారన్, అతని సోదరుడు కళానిధి మారన్ పేర్లను ప్రత్యేక కోర్టు తప్పించినా.. ఒప్పందానికి ఎఫ్‌ఐపీబీ ఇచ్చిన అనుమతిపై మాత్రం సీబీఐ విచారణ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment