బడివేళల మార్పు వెంటనే అమలు.. డీఈఓల సమావేశంలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత, ప్రమాణాలు పెంపు, మెరుగైన విద్యా బోధన అందించే క్రమంలో క్షేత్ర స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు వారంలో ఒకరోజు పాఠశాలల తనిఖీలు, సమీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రంలోని డీఈవోలు, డిప్యూటీఈవోల సమావేశం జరిగింది. వివిధ సర్వేల్లో విద్యార్థులకు చదవడం, రాయడం కూడా రానీ పరిస్థితులపై ఎస్‌సీఈఆర్‌టీ డెరైక్టర్ జగన్నాధరెడ్డి అధికారులతో సమీక్షించారు. చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. డీఈవోలు డిప్యూటీఈవోల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ పరిస్థితులపై తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి వచ్చారు. అయితే ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన, అభివృద్ధిపైనే ప్రధాన దృష్టిసారించనున్నారు.