![మరణించింది ఎవరో నిన్న తెలిసింది... - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/81428310159_625x300.jpg.webp?itok=hDq0ePYQ)
మరణించింది ఎవరో నిన్న తెలిసింది...
హైదరాబాద్ : నల్లగొండ ఆత్మకూరు(ఎం) మండలం జానకీపురం వద్ద ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఇద్దరు వ్యక్తులు సిమీ కార్యకర్తలని నిన్ననే తెలిసిందని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ మరో ముగ్గురు సిమీ కార్యకర్తలను అయిదు రాష్ట్రాల పోలీసులు జల్లెడ పడుతున్నారన్నారు. వారి కోసం నల్లగొండ జిల్లావ్యాప్తంగా పోలీసులు సోదాలు చేపడుతున్నారని నాయిని తెలిపారు.
జరిగిన సంఘటనల్లో హైదరాబాద్కు చెందిన వ్యక్తులు ఎవరూ లేరని, నగరానికి చెందిన వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదని నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ఏది జరిగినా హైదరాబాద్కు ఆపాదించటం సరికాదని, అనవసరంగా హైదరాబాద్ పేరును దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ సురక్షిత ప్రాంతమని నాయిని తెలిపారు. మరోవైపు తీవ్రవాద సంఘటనల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వీఐపీలకు ఇచ్చే భద్రతపై అధికారులు సమీక్ష నిర్వహించారు. నేతల కాన్వాయ్లకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయనున్నారు.