రంగారెడ్డి: ఉప్పల్ సర్కిల్ పరిధిలో గత రెండు నెలల క్రితం తోలగించిన కాంట్రాక్టు కార్మికుడు తీవ్ర మనస్తాపానికి లోనై గురువారం సర్కిల్ కార్యాలయం ఎదుట వెంట తెచ్చుకున్న కిరోసిన్ మీద పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం గమనించిన తోటి కార్మికులు బిగ్గరగా అరవడంతో బందో బస్తుకోసం వచ్చిన ఉప్పల్ పోలీసులు వెంటనే అతన్ని వారించి అదుపులోకి తీసుకున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన గ్యార ఉప్పలయ్య(40) గత 20 సంవత్సరాల క్రితం బతుకు దెరువుకోసం ఉప్పల్‌కు వచ్చి చిలుకానగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు, భార్య లక్ష్మి ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ కార్మికునిగా పని చేస్తున్నాడు. జిహెచ్‌ఎండి ఉప్పల్ సర్కిల్ పరిధిలో సెవన్ హిల్స్ సోసైటిలో పని చేస్తున్నాడు. తొలగించిన దాదాపు 30 మంది కార్మికులు గురువారం తమ విషయం తెలుసుకుందామని ఉప్పల్ సర్కిల్ ఇన్ చార్జీ డిసి విజయకృష్ణతో మాట్లాడానికి వచ్చారు. తన చేతులో ఏమి లేదని డీసీ చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉప్పలయ్య తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ను సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఒంటిపై పోసుకున్నాడు. అగ్గిపుల్లను అంటించుకునే లోపల అప్రమత్తమైన పోలీసులు అతని ఒంటిపై నీరు పోసి అదుపులోకి తీసుకున్నారు.
తోటి కార్మికుల్లో భయాందోళనలు
తోటి కార్మికు ఉప్పలయ్య అనుకోని విధంగా తమ కళ్ల ముందే ఆత్మహత్యాయత్నం చేయడంతో తోటి కార్మికులు తీవ్ర మనస్తాపానికి గురైనారు. వెంటనే తేరుకుని ఉప్పలయ్యకు ధైర్యం చెప్పారు. పిల్లలను స్కూల్ నుంచి గెంటేస్తున్నారు. ఇంటి యజమాని పాత్రలు బయటవే స్తానంటున్నాడు. రెండు నెలల నుంచి అద్దెకట్టడం లేదు. స్కూల్ ఫీజులు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నాను. ఉద్యోగం ఎప్పుడు వస్తదో అని ఎదురు చూస్తున్నాను. కనీసం అప్పులు కూడా ఇవ్వడం లేదు. గత నాలుగు రోజులుగా పస్తులుంటున్నాం. చివరకు ఈ బాధలన్నీ తట్టుకోలేక బతకడం కన్నా చావే నయం అనుకున్నాను. పోలీసులు అడ్డుకున్నారని పుట్టేడు దుఖంతో తన అవేదనను చెప్పుకోచ్చాడు ఉప్పలయ్య.