ఆదినారాయణ ఇంటిముందు మున్సిపల్ అధికారులు వదిలేసిన చెత్త ట్రాక్టర్
పన్నుల వసూళ్ల కోసం చెత్త పద్ధతులు ఫాలో కావద్దని న్యాయస్థానాలు ఓ వైపు చీవాట్లు పెడుతూనే ఉన్నా పురపాలక అధికారుల చిత్తంలో మాత్రం మార్పు రావట్లేదు. చిత్తూరు జిల్లా పుంగనూరులో బకాయి వసూళ్ల కోసం మున్సిపల్ అధికారులు చేసిన నిర్వాకం ఓ నిండు ప్రాణాల్ని బలితీసుకుంది. సకాలంలో పన్నులు చెల్లించలేదంటూ పుంగనూరుకు చెందిన ఆదినారాయణ ఇంటి ముందు చెత్త ట్రాక్టర్ను నిలిపారు. మున్సిపల్ అధికారుల చర్యను ఘోర అవమానంగా భావించిన ఆదినారాయణ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడు ఆదినారాయణ వైఎస్సీర్ సీపీ రైతు విభాగం పుంగనురు అధ్యక్షుడు కూడా. మున్సిపల్ అధికారులే ఆదినారాయణను పొట్టనబెట్టుకున్నారంటూ ఆయన భార్యా, పిల్లలు పెద్దపెట్టున రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. అధికారులపై హత్య కేసు నమోదుచేయాలని కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పుంగునూరు, పలమనేరు ఎమ్మెల్యేలు ఘటనా స్థలాన్ని సందర్శించారు.