ఏ నోట విన్నా..ఓటు మాటే! | Suspense Cash for vote scam | Sakshi
Sakshi News home page

ఏ నోట విన్నా..ఓటు మాటే!

Published Thu, Jun 18 2015 10:50 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

ఏ నోట విన్నా..ఓటు మాటే! - Sakshi

ఏ నోట విన్నా..ఓటు మాటే!

రాజకీయ వర్గాల నుంచి సామాన్య ప్రజానీకం దాకా ఏంజరుగుతుందనే ఉత్కంఠ
చంద్రబాబు, అవినీతి అంశాలే ప్రధానమన్న అభిప్రాయం
రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సఖ్యత దెబ్బతినే ప్రసక్తే లేదంటున్న ప్రజానీకం
హైదరాబాద్‌లో సెక్షన్-8 వర్తింపు అవసరం లేదంటున్న నిపుణులు
టీడీపీ అధినేత ప్రమేయం నిర్ధారణ అవుతుందనే అంచనా
తమదైన శైలిలో విశ్లేషణల్లో మునిగి తేలుతున్న రాజకీయ పక్షాలు

 
నల్లగొండ : జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంపై జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు లంచం ఇస్తూ రేవంత్‌రెడ్డి పట్టుబడిన నాటినుంచి ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలు జిల్లాప్రజల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. రాజకీయపక్షాలే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈ అంశంపై తమదైన రీతిలో చర్చలు జరుపుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు.. ఇలా అన్ని వర్గాల్లోనూ ‘ఓటుకు కోట్లు’ కుంభ కోణంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఉచ్చు బిగుసుకునే పరిస్థితులు కనిపిస్తుండడంతో అన్ని వర్గాల్లోనూ ఈ అంశంపై ఆసక్తి పెరుగుతోంది. తెలంగాణ  గవర్నర్‌తో చర్చలు జరుపుతుండడం, చంద్రబాబు అండ్ కో ఎదురుదాడికి దిగుతుండడం... ఈ సమస్యను రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సమస్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తుండడం... ఈ కుంభకోణంలో రేవంత్‌తో పాటు చంద్రబాబు అరెస్టు తప్పదనే ఊహాగానాలు వస్తుండడం..లాంటి విషయాలు జిల్లా రాజకీయ వర్గాలను కుదిపివేస్తున్నాయి.
 
ఈ సమస్య అందరిదీ కాదు..
ప్రధానంగా ఈ కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే దానిపై జిల్లాలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీగా తమ పార్టీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని డబ్బు సంచులతో మరో ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ వద్దకు పంపడం, ఆ తర్వాత చంద్రబాబు కూడా స్వయంగా ఫోన్‌లో మాట్లాడడం ప్రపంచానికి తెలిసిపోయినందున ఈ అంశం కేవలం చంద్రబాబు, అవినీతి మధ్య సమస్యగానే పరిగణించాలనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. కానీ ఈ అంశాన్ని రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా, తెలుగు ప్రజల మధ్య సమస్యగా చిత్రీకరించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తుండడం, వారికి తెలంగాణలోని టీడీపీ నేతలు వంతపాడుతుండడంపై కూడా జిల్లా ప్రజానీకంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
దీనికితోడు ఏడాది కాలంగా పట్టించుకోని సెక్షన్-8 అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకురావడం, దీన్ని ఉపయోగించి హైదరాబాద్‌లో గవర్నర్‌కు విశేషాధికారాలు కట్టబెట్టడం అవసరం లేదని, ఉమ్మడి రాజధానిలోని ప్రజల జీవితాలకు ముప్పు వచ్చినప్పుడు, వారి ఆస్తులకు రక్షణ లేనప్పుడు మాత్రమే ఆ సెక్షన్ ఉపయోగించాలని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా ఉందని న్యాయ నిపుణులంటున్నారు. ఈ కుంభకోణం కారణంగా ప్రజల మధ్య ఎలాంటి అభిప్రాయబేధాలూ వచ్చే అవకాశం లేదని, హైదరాబాద్‌లో అయినా, జిల్లాలో అయినా ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సఖ్యత దెబ్బతినేందుకు ఆస్కారమే లేదనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది.
 
ఇక, ఈ విషయంలో చంద్రబాబుకు ఏం జరగబోతుందనే అంశంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నందున చంద్రబాబుపై అన్ని సాక్ష్యాధారాల కోసం జాప్యం జరుగుతుందే తప్ప, ఈ విషయంలో ఆయన  ప్రమేయం కచ్చితంగా నిర్ధారణ అవుతుందనే అభిప్రాయం మెజార్టీ ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయితే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేస్తారా లేదా అనే అంశంపై మరింత చర్చ అవసరమని, రాజ్యాంగపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాల్సి ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలంతా రానున్న రెండు, మూడు రోజుల్లో ఏం జరుగుతుందేననే ఉత్కంఠతో ఉన్నారు.
 
ఈ కుంభకోణంపై ఎవరేమంటున్నారంటే...
ఓట్లు కొనడం ప్రారంభమైంది బాబు హయాంలోనే  ఇలాంటి చర్యలు ప్రజాస్వామాన్ని బలహీనపరుస్తాయి. డబ్బు ద్వారా ఓట్లను హైజాక్ చేయడం చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన డబ్బుతో ఏదైనా చేయవచ్చనే అహంకారపూరిత దశకు చేరుకున్నాడు. అతివిశ్వాసంతో ఎమ్మెల్యేని మేనేజ్ చేయబోయి దొరికిపోయాడు. ఈ వ్యవహారం బయటపడగానే చంద్రబాబు తన పదవికి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకుని ఉంటే బాగుండేది. అలా కాకుండా తన విషయాన్ని తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ వ్యవహారంగా, ఆ తర్వాత ఇరు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుండడం మూర్ఖత్వం. ఈ విషయాన్ని విద్యావంతులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. - డాక్టర్ అందె సత్యం, ప్రముఖ ఆర్థికవేత్త
 
ఆ విషయంలో చంద్రబాబును మించిన ఘటికుడు లేడు
భారతదేశంలో అవినీతికి, నీతికి మధ్య విభజన రేఖ స్పష్టంగా తొలగిపోయింది. ఇంతకు ముందు కార్పొరేట్ల స్థాయిలో ఉండే అవినీతి ఇప్పుడు రాజకీయ నాయకుల రాజకీయ నాయకుల మోకాళ్ల ముందుకు చేరింది. టాటాలు, బిర్లాలు, గోయెంకా లాంటి బడాపెట్టుబడి దారులు ఇప్పుడు రాజకీయ నాయకుల ముందు క్యూ కడుతున్నారు. అవినీతికి రాజకీయ నాయకులు కిరీటం పెట్టారు. అవినీతి తిరస్కార స్థాయి నుంచి పూజ్యనీయ స్థాయికి చేరింది. అవినీతితో ఏదైనా చేయగలిగేట్టు ఆరితేరిన ఘటికుల్లో చంద్రబాబును మించిన వాడు ఈ దేశంలోనే లేడు. అతను అసామాన్యుడు. అంచనా వేయలేం. తాను కూరుకుపోతున్న సమయంలోనే ఆయన ఒక్కడే వెళ్లడు. లేదంటే నలుగురిని పూడ్చయినా పైకి వస్తాడన్నది నా అభిప్రాయం.  -వేణు సంకోజు, ప్రముఖ సాహితీవేత్త
 
ఇంటి పేరు అధర్మం.. అసలు పేరు అబద్ధం
‘అసలు ఈ వ్యవహారంలో చంద్రబాబు ఇంకా ఎందుకు బుకాయిస్తున్నాడో అర్థం కావడం లేదు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డబ్బు సంచులతో స్టీఫెన్‌సన్ ఇంటికి వెళ్లింది నిజం కాదా? చంద్రబాబు ఆయనతో ఫోన్‌లో మాట్లాడింది వాస్తవం కాదా? చంద్రబాబు రాజకీయ జీవితమే అవినీతి పునాదులపై ఉంది. ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని సవాల్ చేసి ఆయన పార్టీలో చేరారు. తెలుగు ప్రజల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని చెప్పి ఆయనకే వెన్నుపోటు పొడిచాడు. తెలంగాణకు అనుకూలమేనని లేఖ ఇచ్చి ఆ తర్వాత ట్రస్ట్ భవన్‌లో కూర్చుని రాజకీయాలు చేశాడు. వావివరసలు మరిచి సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు ముద్దులు పెట్టుకున్న ఎపిసోడ్‌కు దర్శక, నిర్మాత చంద్రబాబు. ఈ విషయంలో బాబును ఎవరూ కాపాడలేరు.’  -దుబ్బాక నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు
 
టీడీపీని అడ్డుకునే కుట్ర
ఈ వ్యవహారమంతా టీఆర్‌ఎస్ కుట్ర. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనే ఆలోచనతోనే కేసీఆర్ మా పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నాడు. ప్రలోభాలకు గురికాని వారిని కేసుల్లో ఇరికించి భయబ్రాంతులకు గురిచేయాలనుకుంటున్నాడు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, తెలుగుదేశం పార్టీ ఎక్కడ పుంజుకుంటుందో అనే భయంతోనే ఇదంతా చేస్తున్నాడు. దీన్ని ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు ఇలాంటివి ఎన్నో చూశారు. టీడీపీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దు.
-మాదగోని శ్రీనివాస్‌గౌడ్, టీడీపీ జిల్లా నాయకుడు
 
ఇద్దరూ దొంగలే
‘ఓటుకు కోట్లు’వ్యవహారంలో అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్.. ఇద్దరూ దొంగలే. చంద్రబాబేమో దొరికిన దొంగ.. కేసీఆర్ దొరకని దొంగ. జిల్లాలో మా పార్టీ నేతలందరినీ ఆయన ప్రలోభాలకు గురిచేసి పార్టీలో చేర్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ల నుంచి సర్పంచ్‌ల వరకు కొనుగోలు చేసి తమ పార్టీలో చేరినందుకు వందల కోట్ల నిధులు విడుదల చే స్తూ జీవోలిచ్చారు. దానిపై విచారణ జరపాలి. త్వరలోనే రాష్ట్రపతిని కలిసి ఈ మేరకు ‘ఫిర్యాదు చేస్తాం.’  -బూడిద భిక్షమయ్యగౌడ్, డీసీసీ అధ్యక్షుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement