హైదరాబాద్: హిందువుల ఐక్యత కోసం ప్రాణాలర్పిం చేందుకు సిద్ధమని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఏభై రోజుల క్రితం నగర బహిష్కరణకు గురైన ఆయన న్యాయస్థానం అనుమతితో మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఉదయం 10 గంటలకు బెజవాడలోని దుర్గమ్మను దర్శించుకుని అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరారు. నగరానికి చేరుకున్న ఆయనకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, ఏబీవీపీ, బజరంగ్ దళ్, ఏసీపీఎస్, అభిమానులు మంగళ వాయిద్యాలు, హారతులు, పూర్ణకుంభంతో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద పెద్దఎత్తున స్వాగతం పలికారు. స్వాగతం పలికినవారిలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
తెలంగాణలో అడుగుపెట్టే అవకాశం తనకు దుర్గమ్మ అమ్మవారు కల్పించారని అన్నారు. పోలీసులు, ప్రభుత్వంపై కోపం లేదని, ప్రజల మనోభావాలు కించపరిచేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదన్నారు. ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ హిందూసమాజాన్ని అణచివేయాలని చూస్తోందని, వారి ఆటలు చెల్లవని స్పష్టం చేశారు. తాను వచ్చేది ఎవరికీ తెలియదనీ, అయినా లక్షలాది హిందూ జనం స్వాగతించటం హిందూ సమాజానికి గర్వకారణమన్నారు. 15 నిమిషాల్లో హిందువులను నరికివేస్తామన్న వారికి ప్రభుత్వం భద్రత కల్పిస్తూ, పోలీసుల కుటుంబాలు బాగుండాలని కోరుకునే తన లాంటి సన్యాసులపై పీడీ యాక్ట్ ప్రయోగించి బహిష్కరించారని, హిందూ సమాజానికి చేసే న్యాయం ఇదేనా.. అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
పాకిస్తాన్‌లోనూ ఇలాంటి సాహసం చేయరని, 19 గంటలపాటు పలు గ్రామాల్లో తిప్పుకుంటూ ఆహారం ఇవ్వకుండా తనను ఇబ్బంది పెట్టిన పోలీసులకే తాను భోజనం పెట్టించానన్నారు. హిందూ సంఘాలన్నీ ఏకమై హిందువుల ఐక్యత కోసం సంఘటితం కావాలని, ఇందుకు తన ప్రాణాలను సైతం అర్పించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. హిందువులు చేతగానివారనే భావనను విడనాడాలని, హైదరాబాద్ లో హిందూ మహా సముద్రాన్ని చూపిస్తానని అన్నారు. ఆదిలాబాద్ నుంచి యాత్ర చేపట్టి రాష్రాన్ని చుట్టి వస్తానని, ప్రతి హిందువు గుండెను తట్టి లేవుతానని చెప్పారు. అనంతరం ట్యాంక్‌బండ్ చేరుకొని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
Comments
Please login to add a commentAdd a comment