
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. మూడు వారాల్లోనే 1,170 మంది నుంచి నమూనాలు సేకరించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్ (ఐపీఏం)లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరపగా, వీరిలో 131 మందికి పాజిటివ్ అని తేలింది. వీటిలో ఒక్క హైదరాబాద్‌లోనే 47 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉస్మానియా, గాంధీఆస్పత్రుల్లోని స్వైన్‌ఫ్లూ వార్డుల్లో 10 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పెరుగుతున్న చలితీవ్రత.. ఉదయం మంచు కురుస్తుండటంతో ఫ్లూ కారక వైరస్ బలోపేతం అవుతోంది. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఫ్లూ కేసులు నమోదు కావడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఐదేళ్ల తర్వాత ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అయితే స్వైన్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసు్కోవాలని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇప్పటి వరకు 29 మంది మృతి..
గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఫ్లూ లక్షణాలతో ఉస్మానియా ఆస్పత్రిలో 228 మంది చేరగా, వైద్యులు వారి నుంచి నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపారు. వీరిలో 38 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. ఫ్లూ బాధితుల్లో 50 నుంచి 70 ఏళ్ల లోపు వారు 38 మంది ఉండగా, మిగిలిన వారంతా 50 ఏళ్ల లోపువారే. బాధితుల్లో 60 శాతం మంది పాత బస్తీ పరిసర ప్రాంతాలకు చెందిన వారే కావడం గమనార్హం. గాంధీ ఆస్పత్రి స్వైన్‌ఫ్లూ నోడల్ సెంటర్‌లో గతేడాది నుంచి ఇప్పటి వరకు 80 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, వీరిలో 19 మంది మరణించారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఏడుగురు చికిత్స పొందుతుండగా, వీరిలో ఐదుగురికి పాజిటివ్ రాగా, మరో నలుగురిని అనుమానిత ఫ్లూ కేసులుగా నమోదు చేసుకుని చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు..
సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఒకేలా ఉంటాయి. అంతమాత్రాన జ్వరం, దగ్గు, ముక్కు కారడం తదితర లక్షణాలు కనిపించగానే స్వైన్ ఫ్లూగా భావించాల్సిన అవసరం లేదు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే మధుమేహులు, గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, కిడ్నీ, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు ఫ్లూ భారిన పడే అవకాశాలు ఎక్కువ. స్వైన్‌ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడగా ఉండటం, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నవారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలి. బయట నుంచి ఇంటికి వెళ్లగానే చేతులు, కాళ్లు సబ్బుతో కడుక్కోవాలి. మూడు కన్నా ఎక్కువ రోజులు పై లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment