సాక్షి, హైదరాబాద్: స్వైన్ ‘ఫ్లో’.. మళ్లీ మొదలైం ది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కు తోడు పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో హెచ్1ఎన్1 స్వైన్‌ఫ్లూ కారక వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,300 పైగా కేసులు నమోదు కాగా, వీరిలో 21 మంది మృతి చెందారు. తాజాగా హైదరాబాద్‌లో మరో నాలుగు అనుమానిత ఫ్లూ కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బాధితుల్లో ఇద్దరు పురుషులు కాగా.. ఒక మహిళ, ఒక బాలుడున్నట్లు సమాచారం. వీరిలో ఒకరు గాంధీలో చికిత్స పొందుతుండ గా, మరో ముగ్గురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఆయా ఆస్పత్రుల వైద్యులు వీరి నుంచి నమూనాలు సేకరించి వ్యా ధి నిర్ధారణ కోసం ఐపీఎంకు పంపినట్లు చెబుతున్నాయి. ప్రస్తుతం వారికి అనుమానిత స్వైన్ ఫ్లూగా భావించి చికిత్సలు అందజేస్తున్నారు.
ఒకరి నుంచి మరొకరికి..
- ఫ్లూ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్ గాలిలోకి ప్రవేశించి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
- రోగ నిరోధక శక్తి తక్కువున్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
- జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్న వారు జన సమూహంలోనికి వెళ్లకపోవడమే ఉత్తమం.
- బాధితులు ఉపయోగించిన రుమాలు, టవల్ వంటివి వాడొద్దు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముఖానికి అడ్డంగా కర్చీఫ్‌ను పెట్టుకోవాలి.
- జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారితో కరచాలనం, ఆలింగనాలు చేయొద్దు.
- మందులు వాడుతున్నా లక్షణాలు తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి.
గ్రేటర్‌లో 1,106 కేసుల నమోదు
2009లో ‘హెచ్1ఎన్1’ఇన్‌ఫ్లూయెంజా వైరస్ తొలిసారిగా వెలుగుచూసింది. తర్వాత నగరంలో స్వైన్‌ఫ్లూ కేసులు, మరణాలు భారీగా నమోదయ్యాయి. ఏడాది పాటు నిశ్శబ్దంగా ఉన్న వైరస్ మళ్లీ 2012లో ప్రతా పం చూపించింది. ఈ ఏడాది ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్‌లో 671, రంగారెడ్డి 208, మేడ్చల్ జిల్లాలో 227 ప్లూ పాజి టివ్ కేసులు నమోదవగా 21 మంది మృతిచెందారు. మారిన వాతావరణ పరిస్థితులకు తోడు ఇటీవల గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జనసమూహంలో ఎక్కువగా గడపడం వల్ల ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి సులభంగా విస్తరించినట్టు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాం
ముందు జాగ్రత్తల్లో భాగంగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్, ఛాతి ఆస్పత్రి సహా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, ఏరియా ఆస్పత్రులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ఎన్–95 రకం మాస్క్‌లను ప్రభుత్వం సరఫరా చేసింది. రోగుల కోసం ‘ఒసల్టామీవిర్’ టాబ్లెట్స్‌ను, డబుల్ లేయర్ మాస్క్‌లను అందుబాటులో ఉంచింది. స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలను గాంధీ, ఫీవర్, ఐపీఎంలో ఉచితంగా చేస్తున్నాం.
– డాక్టర్ శంకర్, ఫీవర్ ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment