n1h1
-
చైనాను కలవరపెడుతోన్న మరో వైరస్
బీజిగ్: ఓ వైపు కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండగానే.. మరో కొత్త రకం స్వైన్ ఫ్లూ వైరస్ ఒకటి ప్రస్తుతం చైనాను కలవరపెడుతోంది. ఇది గతంలో విస్తరించిన స్వైన్ ఫ్లూ వైరస్ కంటే ఎంతో ప్రమాదకరమైనదని.. అంటువ్యాధిగా మారే లక్షణాలు కలిగి ఉందని అమెరికా సైన్స్ జర్నల్ పీఎన్ఏఎస్ సోమవారం ప్రచురించింది. జీ4 అని పిలువబడే ఇది జన్యుపరంగా 2009లో స్వైన్ ఫ్లూకు కారణమైన హెచ్1ఎన్1 జాతి నుంచి వచ్చిందని నివేదిక వెల్లడించింది. ఇది మానవులకు సోకడానికి అవసరమైన అన్ని లక్షణాలను కలిగి ఉందని చైనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు వెల్లడించారు. (చైనా ప్రాజెక్టులకు కరోనా సెగ) పరిశోధకులు 2011 నుంచి 2018 వరకు 10 చైనా ప్రావిన్సులు, పశువైద్య ఆస్పత్రులు, కబేళాలలో పందుల నుండి 30,000 వేల స్వాబ్స్‌ను సేకరించి పరిశోధనలు జరిపారు. దాదాపు 179 స్వైన్ ఫ్లూ వైరస్‌లను ఐసోలేట్ చేసినట్లు తెలిపారు. అయితే 2016 నుంచి కొత్త రకం వైరస్ ఒకటి పందులలో బాగా అభివృద్ధి చెందినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని గురించి తెలుసుకోవడానికి పరిశోధకులు ఫెర్రోట్స్‌తో సహా పలు ప్రయోగాలు చేశారు. ప్లూ పరిశోధనల్లో ఈ ఫెర్రోట్స్ టెస్ట్‌ను బాగా ఉపయోగిస్తారు. ఎందుకుంటే ఈ వ్యాధి సోకిన వారిలో జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలే కనపడతాయి. అయితే తాజాగా గుర్తించిన జీ4 చాలా ప్రమాదకరమైన అంటువ్యాధిగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫెర్రెట్ల కంటే తీవ్రమైన లక్షణాలు కలిగి ఉందని తెలిపారు. సాధారణ ఫ్లూ నుంచి మానవుల్ని రక్షించే రోగనిరోధక శక్తి ఈ జీ4 నుంచి కాపాడలేదని పరీక్షలు తెలుపుతున్నాయన్నారు. (చైనాకు పాశ్చాత్య సెగ) ఇప్పటికే 4.4 శాతం మంది జనాభా ఈ జీ4 బారిన పడినట్లు పరీక్షల్లో తేలిందన్నారు శాస్త్రవేత్తలు. అంతేకాక ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు వ్యాపించినట్లు గుర్తించామన్నారు. అయితే ఇది మానవుడి నుంచి మానవునికి వ్యాపిస్తుందనే దానిపై ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించలేదన్నారు. ఒకవేళ జీ4 వైరస్ మానవుల్లో ఒకరి నుంచి ఇతరులకు వ్యాపిస్తే.. మహమ్మారిగా మారే ప్రమాదం అధికంగా ఉందన్నారు. కనుక పందులతో పని చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు కోరారు. ‘జూనోటిక్ రోగకారకాలు రోజురోజుకు అభివృద్ధి చెందుతుండటంతో మానవులు నిరంతరం ప్రమాదంలో ఉన్నారు. వన్యప్రాణుల కంటే కూడా మానవులకు ఎక్కువ సంబంధం ఉన్న వ్యవసాయ జంతువుల నుంచి ఈ మహమ్మారి వైరస్లు ఎక్కువ వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తున్నది’ అని అని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో వెటర్నరీ మెడిసిన్ విభాగం చీఫ్‌గా పని చేస్తున్న జేమ్స్ వుడ్ తెలిపారు. వైరస్ జంతువు నుంచి మానవులకు వ్యాప్తి చెందటాన్ని జూనోటిక్ ఇన్ఫెక్షన్ అంటారు. -
మళ్లీ..స్వైన్ ‘ఫ్లో’!
సాక్షి, హైదరాబాద్: స్వైన్ ‘ఫ్లో’.. మళ్లీ మొదలైం ది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కు తోడు పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో హెచ్1ఎన్1 స్వైన్‌ఫ్లూ కారక వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,300 పైగా కేసులు నమోదు కాగా, వీరిలో 21 మంది మృతి చెందారు. తాజాగా హైదరాబాద్‌లో మరో నాలుగు అనుమానిత ఫ్లూ కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బాధితుల్లో ఇద్దరు పురుషులు కాగా.. ఒక మహిళ, ఒక బాలుడున్నట్లు సమాచారం. వీరిలో ఒకరు గాంధీలో చికిత్స పొందుతుండ గా, మరో ముగ్గురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఆయా ఆస్పత్రుల వైద్యులు వీరి నుంచి నమూనాలు సేకరించి వ్యా ధి నిర్ధారణ కోసం ఐపీఎంకు పంపినట్లు చెబుతున్నాయి. ప్రస్తుతం వారికి అనుమానిత స్వైన్ ఫ్లూగా భావించి చికిత్సలు అందజేస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి.. ఫ్లూ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్ గాలిలోకి ప్రవేశించి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువున్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్న వారు జన సమూహంలోనికి వెళ్లకపోవడమే ఉత్తమం. బాధితులు ఉపయోగించిన రుమాలు, టవల్ వంటివి వాడొద్దు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముఖానికి అడ్డంగా కర్చీఫ్‌ను పెట్టుకోవాలి. జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారితో కరచాలనం, ఆలింగనాలు చేయొద్దు. మందులు వాడుతున్నా లక్షణాలు తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. గ్రేటర్లో 1,106 కేసుల నమోదు 2009లో ‘హెచ్1ఎన్1’ఇన్‌ఫ్లూయెంజా వైరస్ తొలిసారిగా వెలుగుచూసింది. తర్వాత నగరంలో స్వైన్‌ఫ్లూ కేసులు, మరణాలు భారీగా నమోదయ్యాయి. ఏడాది పాటు నిశ్శబ్దంగా ఉన్న వైరస్ మళ్లీ 2012లో ప్రతా పం చూపించింది. ఈ ఏడాది ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్‌లో 671, రంగారెడ్డి 208, మేడ్చల్ జిల్లాలో 227 ప్లూ పాజి టివ్ కేసులు నమోదవగా 21 మంది మృతిచెందారు. మారిన వాతావరణ పరిస్థితులకు తోడు ఇటీవల గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జనసమూహంలో ఎక్కువగా గడపడం వల్ల ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి సులభంగా విస్తరించినట్టు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాం ముందు జాగ్రత్తల్లో భాగంగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్, ఛాతి ఆస్పత్రి సహా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, ఏరియా ఆస్పత్రులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ఎన్–95 రకం మాస్క్‌లను ప్రభుత్వం సరఫరా చేసింది. రోగుల కోసం ‘ఒసల్టామీవిర్’ టాబ్లెట్స్‌ను, డబుల్ లేయర్ మాస్క్‌లను అందుబాటులో ఉంచింది. స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలను గాంధీ, ఫీవర్, ఐపీఎంలో ఉచితంగా చేస్తున్నాం. – డాక్టర్ శంకర్, ఫీవర్ ఆస్పత్రి -
వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ
* తెలంగాణలో 54 కేసులు నమోదు.. 8 మంది మృతి * జిల్లాలకు మందుల సరఫరా * స్వైన్‌ఫ్లూపై కేంద్రానికి నివేదిక * చీటింగ్ చేస్తే సీజే: రాజయ్య సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. గడచిన కొద్ది నెలలుగా 54 కేసులు నమోదయ్యాయి. సకాలంలో గుర్తించని కారణంగా ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. వీరిలో నలుగురు గత రెండు రోజుల్లోనే మృతిచెందడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్వైన్‌ఫ్లూ కేసులు భారీగా నమోదు అవుతుండటంతో వైద్య ఆరోగ్య యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎన్ని కేసులు నమోదయ్యాయో చెప్పడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. గుండె, లివర్, కిడ్నీ వంటి వ్యాధులు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి త్వరగా వైరస్ సోకే ప్రమాదముందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు చనిపోయిన వారిలో ముగ్గురికి గుండె, షుగర్ వంటి వ్యాధులు ఉన్నాయని... వారికే స్వైన్‌ఫ్లూ సోకిందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చలికాలం కావడంతో వైరస్ సులువుగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని... రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి సోకే ప్రమాదం ఉందని అంటున్నారు. అందుబాటులో ‘వసాల్టిమీవిర్’ ఔషధం.. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్ర, ఏరియా ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ మందులను అందుబాటులో ఉంచారు. అవసరాన్ని బట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కూడా పంపాలని వైద్యాధికారులు ఆదేశాలు జారీచేశారు. స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా ఉన్నట్లు గుర్తిస్తే ‘వసాల్టిమీవిర్’ ఔషధం వాడాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డెరైక్టర్ పి.సాంబశివరావు ‘సాక్షి’కి చెప్పారు. ఈ ఔషధం పెద్దలకు మాత్రల రూపంలో, పిల్లలకు చుక్కల రూపంలో అందుబాటులో ఉందన్నారు. స్వైన్‌ఫ్లూ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారిస్తే ఈ ఔషధాన్ని వారం రోజులు వాడాల్సి ఉంటుందన్నారు. తలనొప్పి, ఒంటినొప్పులు, జలుబు, దగ్గు, జ్వరం ఉంటే అనుమానించి సమీపంలో ఉన్న ఆసుపత్రులకు వెళ్లి చూపించుకోవాలని ఆయన సూచించారు. ప్రధానంగా బలవర్థకమైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకోవాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ప్రజలు ఏమాత్రం భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని... మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్వైన్‌ఫ్లూపై కేంద్రానికి నివేదిక.. స్వైన్‌ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి గురువారం నివేదిక సమర్పించింది. కొన్ని నెలలుగా రాష్ట్రంలో 54 కేసులు నమోదు అయ్యాయని, జిల్లాలకు అవసరమైన మందులను సరఫరా చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరునూ ప్రస్తావించారు. చీటింగ్ చేస్తే సీజే.. డెంగీ, స్వైన్‌ఫ్లూ, ఎబోలా వ్యాధుల పేరుతో రోగులను చీటింగ్ చేసే ఆస్పత్రులను సీజ్ చేయిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య హెచ్చరించారు. ప్రమాదకరమైన వైరస్ సోకిన రోగి ఐసోలేషన్ వార్డులో ఉండకుండా బయట తిరగడంతో వైరస్ వ్యాప్తి చెందుతుందని, అటువంటి రోగులను గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన పర్యవేక్షణ బృందాల జాడే లేదని‘ సాక్షి’ ప్రచురించిన కథనానికి మంత్రి రాజయ్య స్పందించారు. వ్యాధుల పేరుతో రోగులను చీటింగ్ చేస్తూ చికిత్సల పేరుతో రోగుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్న ఆస్పత్రులపై విజిలెన్స్ దాడులు చేయించి వాటిని సీజ్ చేయిస్తామన్నారు. గాంధీ జనరల్ ఆసుపత్రిలోని స్వైన్‌ఫ్లూ వార్డును గురువారం ఆయన సందర్శించారు. డీఎంఈ పుట్టా శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ధైర్యవాన్, ఇతర వైద్య అధికారులతో స్వైన్‌ఫ్లూపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని ఫీవర్ ఆసుపత్రిలో అధునాతనమైన ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.