ప్రజలకు ఒరిగిందేమి లేదు.. | T TDP L Ramana Protest In Karimnagar | Sakshi
Sakshi News home page

ప్రజలకు ఒరిగిందేమి లేదు..

Published Fri, Jul 13 2018 11:25 AM | Last Updated on Wed, Aug 15 2018 9:10 PM

T TDP  L Ramana Protest In Karimnagar - Sakshi

మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ

టవర్‌సర్కిల్‌: తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ద్వారా నాలుగేళ్లలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీడీపీ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మొదటగా కలెక్టరేట్‌ క్రాసింగ్‌ నుంచి ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్‌లోకి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సుమారు గంటపాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అద్యక్షుడు ఎల్‌.రమణ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీలు నాలుగేళ్లు దాటినా అమలుకు నోచుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

లక్ష ఉద్యోగాల భర్తీ మిథ్యగా మారిందని, డీఎస్సీ ప్రకటనలకే పరిమితమైందన్నారు. పరిశ్రమల మూసివేత, అసంఘటిత రంగాలపై నిర్లక్ష్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిలిపివేతతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నాల్గుసార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెల గారడీగానే ఉందన్నారు. వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. చేనేత కార్మికుల కోసం ఇవ్వాల్సిన మూలధనం వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దళితుల మూడెకరాల భూపంపిణీ బూటకంగా మారిందని విమర్శించారు. డబుల్‌బెడ్‌రూమ్‌కు మోక్షం లేకుండా పోయిందని, 22 లక్షల కుటుంబాలకు ఎప్పుడు ఇండ్లు నిర్మిస్తారని ప్రశ్నించారు.

భూప్రక్షాళన పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాసుపుస్తకాల్లో తప్పులు, అన్నదమ్ముల మధ్య కీచులాటలు తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబపాలన నడుస్తోందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఒక్కని నర్సింహులు, అంబటి జోజిరెడ్డి, కళ్యాడపు ఆగయ్య, ఐల్నేని సాగర్‌రావు, అక్కపాక తిరుపతి, నసీర్, గుర్రం వెంకటేశ్వర్లు, మాదాడి శ్రీనివాస్‌రెడ్డి, కాశీనాథం, షకీల్‌అహ్మద్, ఆడెపు కమలాకర్, దామెర సత్యం, కరుణాకర్‌రెడ్డి, శివరామకృష్ణ, దాసరి ప్రవీణ్, శంకర్, పుల్లాచారి, కిషోర్, రాజేశం, సలీం, రమేశ్, వాణి, ఈశ్వరి, అనసూర్యనాయక్, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement