వీవోలకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్న అధికారులు
కరన్‌కోట్ : స్వయం సహాయక సంఘాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఆర్థిక వ్యవహారాలతో పాటు కార్యకలాపాలను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ట్యాబ్‌లను అందజేసింది. జిల్లాలో 322 గ్రామసంఘాలకు అధికారులు ట్యాబ్‌లను అందించారు. విడతల వారీగా జిల్లాలోని అన్ని సంఘాలకు వీటిని అందజేయనున్నారు. ట్యాబ్‌లు పంపిణీ చేసిన సంఘాలకు అర్థిక లావాదేవీల నిర్వహణ తీరుపై అధికారులు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.
ట్యాబ్‌ల ద్వారా రుణం నేరుగా సభ్యురాలికే చేరుతుంది. మరికొన్ని రోజుల్లో ట్యాబ్‌లకు సంఘం సభ్యులందరినీ ఐరిస్ పరిజ్ఞానం ద్వారా అనుసంధానం చేసి వాటి ఆధారంగానే లావాదేవీలు కొనసాగించేలా ప్రణాళిక రూపొందించారు. ట్యాబ్‌లో నమోదు చేసిన కనుబొమ్మను పోలితేనే ఆ సభ్యురాలి ఖాతాలోకి రుణం చేరుతుంది. ట్యాబ్‌ల పంపిణీ ద్వారా రుణాల కోసం మహిళా సంఘాల సభ్యులు పనులు వదులుకొని బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగకుండా ఉపశమనం లభించనుంది.
రుణం అవసరరమున్న వారి దరఖాస్తులు, ఫొటోలు, ఫోన్‌నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంకు అకౌంట్ తదితర వివరాలను ట్యాబ్‌ల్లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ వివరాలను పరిశీలించి రుణాన్ని మంజూరు చేస్తారు. అనంతరం సంతకాలను ట్యాబ్‌ల ద్వారానే తీసుకుని రుణాల్ని అందజేస్తారు. రుణం తీసుకొన్న తరువాత ప్రతినెలా చెల్లించాల్సిన, చెల్లించిన సొమ్ము, వివరాలను అందులోనే నమోదు చేయాలి. ట్యాబ్‌ల ఆపరేటింగ్ బాధ్యతలను గ్రామ సంఘాల అధ్యక్షురాలు, కోశాధికారి, కార్యదర్శులు చూస్తారు. ఈ విధానం ద్వారా రుణాలు దుర్వినియోగమయ్యే ప్రమాదముండదని అధికారులు అంటున్నారు. అదేవిధంగా కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు గ్రామానికి సంబంధించిన వివరాలు క్షణాల్లో తెలుసుకునే వీలు కలిగింది.
గ్రేడింగ్ ఆధారంగా కేటాయింపు..
ఇప్పటికే సంఘాల పనితీరుకు ఇస్తున్న గ్రేడింగ్ ఆధారంగానే ట్యాబ్‌లను కేటాయించారు. 11 అంశాలకు 100 మార్కులతో గ్రేడింగ్ ఇచ్చి, 100 మార్కుల్లో 85 నుంచి 100 సాధించిన వారికి (ఎ) గ్రేడ్, 70 నుంచి 85 (బీ), 60 నుంచి 70 (సీ), 50 నుంచి 60 (డీ), 50 కంటే తక్కువ మార్కులు సాధించిన వారికి (ఈ) గ్రేడ్‌లను ఇస్తున్నారు. ఇందులో ఏ, బీ, సీ గ్రేడ్‌లు సాధించిన సంఘాలకు ట్యాబ్‌లను కేటాయించారు. జిల్లాలో అర్హత సాధించిన వీవోలకు విడతల వారీగా వీటిని పంపిణీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment