సాక్షి, హైదరాబాద్: ఈనెల 23న జరగనున్న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌లో పలు జాగ్రత్తలు వహించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. పింక్‌స్లిప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. గురువారం ఉత్తమ్ అధ్యక్షతన గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షులు, ఎంపీగా పోటీచేసిన అభ్యర్థులతో సమావేశం జరిగింది. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఏఐసీసీ పంపిన మార్గదర్శకాలను ఉత్తమ్ వివరించారు. కౌంటింగ్ మొదలు కాకముందే కేంద్రం లోపలికి వెళ్లాలని, ఆ ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాతే అక్కడ్నుంచి బయటకు రావాలని ఏజెంట్లకు సూచించాలని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ వ్యవహరించిన తీరు, పోలింగ్ సరళి ఆధారంగా ఫలితాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రాదేశిక ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధిస్తామని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎస్‌ఈసీని కలవనున్న టీపీసీసీ
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజుల తర్వాత జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీల ఎన్నికలు నిర్వహించడం సబబు కాదని, అధికార పార్టీకి సానుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమయింది. దీంతో జెడ్పీచైర్మన్లు, ఎంపీపీల ఎన్నిక ప్రక్రియను కూడా ఫలితాలు వచ్చిన వెంటనే నిర్వహించాలని, లేదంటే పాత సభ్యుల పదవీ కాలం ముగిసేంతవరకు ఫలితాలను వాయిదా వేయాలని కోరుతూ ఎన్నికల సంఘాన్ని కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రం అందజేయాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్‌లు యశోదా ఆస్పత్రికి వెళ్లి కొండపోచమ్మ సాగర్ నిర్వాసితుల కోసం దీక్ష చేస్తున్న సిద్ధిపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు టి.నర్సారెడ్డి చేత దీక్షను విరమింపజేశారు.
అపహాస్యం చేయడమే: ఉత్తమ్
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల రోజుల తర్వాత జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీల ఎన్నికలు నిర్వహించడమంటే ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడమేనని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్, కుసుమ కుమార్‌లతో కలసి ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఫలితాలు వచ్చిన వెంటనే కొత్త వారిని ప్రమాణ స్వీకారం చేయించి వారిచేత ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్లు వేయించాలని, ఫలితాలు వెలువడిన మరుసటిరోజే ఎంపీపీ, జెడ్పీచైర్మన్లను ఎన్నికలను కూడా నిర్వహించాలని, లేదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
లేదంటే ఈ నెలరోజుల్లో బేరసారాలకు అవకాశం కల్పించినట్టు అవుతుందని, ఈ మేరకు ఎన్నికల సంఘాన్ని కలసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. ఈనెల 21 రాజీవ్‌గాంధీ వర్థంతిని ఘనం గా నిర్వహిస్తామని, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎ.రేవంత్‌రెడ్డి, జెట్టి కుసుమకుమార్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, ఎంపీ అభ్యర్థులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బలరాంనాయక్, గాలి అనిల్‌కుమార్, ఫిరోజ్‌ఖాన్, అంజన్‌కుమార్ యాదవ్‌లతో పాటు 15 జిల్లాల డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment