చంద్రబాబుకు తలసాని సవాల్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ మత్స్య, పాడిపరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. మంత్రి పదవులు ఇచ్చిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తే ఇక్కడ తాను కూడా రాజీనామా చేస్తానని ఆయన డిమాండ్ చేశారు. నీతి, నిజాయితీ, నిప్పు అనే పదాలు చంద్రబాబుకు సరిపోవని తలసాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక నుంచి చంద్రబాబు ఆ పదాలను వాడటం మానేయాలని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపలో క్రమశిక్షణ ఎన్టీఆర్‌తోనే పోయిందన్నారు.
చంద్రబాబును చూసి నేతలు, కార్యకర్తలు అసహ్యించుకుంటున్నారన్నారు. గతంలో తనపై, కేసీఆర్‌పై దుమ్మెత్తిపోసి ఇప్పుడు చంద్రబాబు చేసిందేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. సోషల్ మీడియాను ఒకసారి చంద్రబాబు చూస్తే వాస్తవాలు తెలుస్తాయని తలసాని అన్నారు. 2004లో కంటే 2019 ఎన్నికలలో ఏపీలో ఘోరమైన ఫలితాలు రాబోతున్నాయని తలసాని జోస్యం చెప్పారు. కాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి, పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు...కేబినెట్‌లో చోటు కల్పించిన విషయం తెలిసిందే.