అక్రమాల కట్ట
ట్యాంక్‌బండ్ పనుల్లో నాణ్యతాలోపం
నాసిరకం మట్టి వినియోగం
వర్షమొస్తే కట్ట కనుమరుగే..
అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం
ప్రసిద్ధిగాంచిన భద్రకాళి చెరువును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ వద్దనున్న నెక్లెస్‌రోడ్డు తరహాలో భద్రకాళి చెరువులో కట్ట(ఫోర్ షోర్ బండ్) నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంతో గ్రేటర్ వరంగల్‌కు కొత్త శోభ తేవాలని ప్రభుత్వం భావించింది. ఇలాంటి ప్రతిష్టాత్మక పనుల్లో నాణ్యత ఎక్కడా కనిపించడం లేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మద్దతు ఉందన్న ధీమాతో కాంట్రాక్టర్లు ఇష్టారీతిన పనులు చేస్తున్నారు. అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా పనులు జరిగేలా చూడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు.
వరంగల్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చారిత్రక నగరాల అభివృద్ధి పథకం(హృదయ్)లో భాగంగా భద్రకాళి చెరువును సుందరీకరించేందుకు రూ.15 కోట్లు కేటాయించారు. చెరువును అభివృద్ధి చేసి... హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డు తరహాలోనే భద్రకాళి చెరువు ముందువైపు కట్ట(ఫోర్ షోర్ బండ్) నిర్మించాలని నిర్ణయించారు. చెరువు కట్టను ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసేందుకు మొదటి దశలో రూ.2.97 కోట్లు విడుదలయ్యాయి. హృదయ్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకం కింద అదనంగా రూ.4.05 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల టెండర్ల నిర్వహణ చిన్ననీటి పారుదల శాఖ అధ్వర్యంలో జరగగా.. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి.
నాణ్యత లేని పనులు
ఫోర్ షోర్ బండ్ పనులకు సంబందించి టెండర్ల ప్రక్రియలోనే నిబంధనల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులు చూస్తే కూడా ఇదే స్పష్టమవుతోంది. అన్ని దశల్లోనూ పనులు టెండరు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. భద్రకాళి చెరువు కట్టను పరిష్టపరిచేందుకు సమీపంలోని రంగసముద్రం చెరువు నుంచి మట్టి తేవాలని నిబంధన ఉంది. రంగసముద్రంలోని చెరువు మట్టి గట్టిగా ఉంటుంది. దూరంలో ఉన్న ఈ చెరువు మట్టిని తెస్తే ఖర్చు ఎక్కువవుతుందనే ఉద్దేశంతో కాంట్రాక్టరు.. భద్రకాళి చెరువులోని బురద మట్టినే తీసి కట్ట నిర్మాణం కోసం వినియోగిస్తున్నాడు. చెరువులోని అడుగు మట్టి(రేగడి) బురదమయంగా ఉంది. ఇలాంటి మట్టిని కట్ట నిర్మాణ కోసం ఉపయోగించడం వల్ల ఫోర్ షోర్ బండ్ నాణ్యత లేకుండా పోతోంది. ఎండాకాలం కావడంతో ఆ మట్టి ఇప్పుడు కొంత గట్టిగా ఉంది. ఒక్క వర్షం పడితే నల్లమట్టి మొత్తం బురదగా మారి కట్ట మొత్తం నీళ్లలోకి జారిపోతుంది. అప్పుడు నెక్లెస్‌రోడ్డు తరహా నిర్మాణం కాదు కదా... అసలు కట్ట ఆనవాళ్లే కనిపించని పరిస్థితి ఉంటుంది. ఇది కాకుండా మట్టి కట్ట నిర్మాణంలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.
కట్టను వెడల్పు చేసేందుకు మట్టి పోస్తూ పాత రోలర్‌ను ఉపయోగిస్తే ప్రతి 22సెం.మీటర్లకు, వైబ్రేటర్ రోలర్‌ను ఉపయోగిస్తే ప్రతి 0.45 సెం.మీటర్లు నీళ్లు చల్లుకుంటూ రోలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదేమీ చేయకుండా ఒకేసారి పెద్దఎత్తున మట్టిపోస్తూ రోలింగ్ చేయ డం వల్ల భవిష్యత్తులో భారీ వర్షాలకు గుంతలు పడే అవకాశాలుంటాయని ఇం జనీరింగ్ నిఫుణులు అంటున్నారు. ఈ పనులు పర్యవేక్షిస్తున్న కుడా ఇంజనీరింగ్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ పనుల్లో మట్టిపైన మొ రం పోస్తూ నాణ్యత లోపాలను పైకి కనిపించకుండా చేస్తున్నారు. చారిత్రక చెరు వు పనుల్లో ఇన్ని రకాలుగా అక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలు తావిస్తోంది. అయితే, అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతి నిధి అండతోనే కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.