సాక్షి, సిటీబ్యూరో: ‘స్మోక్ ఫ్రీ హైదరాబాద్’ సాకారమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన నగర పోలీసులు పొగరాయుళ్లపై కొరడా ఝుళిపిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ స్పెషల్ డ్రైవ్‌ను నగర కొత్వాల్ అంజనీకుమార్ సోమవారం అధికారికంగా ప్రారంభించిన విషయం విదితమే. సోమ–మంగళవారాల్లో క్షేత్రస్థాయి అధికారులు మొత్తం 60 మంది బహిరంగ పొగరాయుళ్లను గుర్తించి రూ.200 చొప్పున జరిమానా విధించారు. అత్యధికంగా పశ్చిమ మండల పరిధిలోని పంజగుట్ట, ఎస్సార్‌నగర్‌ల్లో ఆపై గాంధీనగర్, అబిడ్స్, మార్కెట్ ఠాణాల పరిధిలో కేసులు నమోదయ్యాయి.
బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగకుండా నియంత్రించడం ద్వారా గాంధీ జయంతి (అక్టోబర్–2) నాటికి ‘స్మోక్ ఫ్రీ హైదరాబాద్’ లక్ష్యాన్ని సాధించాలని నగర పోలీసులు లక్ష్యంగా నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 30 నుంచి నగరం వేదికగా జరిగే ‘50వ ప్రపంచ ఊపిరితిత్తుల ఆరోగ్య సదస్సు’ నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ‘ప్రపంచ నో టుబాకో’ డే కావడంతో ఆ రోజు నుంచి ఈ స్పెషల్‌డ్రైవ్ మరింత వేగం పుంజుకోనుంది. అనునిత్యం రహదారులపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులు, గస్తీ తదితర విధుల్లో ఉండే శాంతిభద్రతల విభాగం అధికారులు సైతం బహిరంగ ప్రదేశాల్లోని పొగరాయుళ్లపై కేసులు నమోదు చేస్తున్నారు. తమ వద్ద ఉండే ట్యాబ్స్‌ను వినియోగించి వారికి జరిమానా విధిస్తున్నారు. దీంతో పాటు సిగరెట్–పొగాకు ఉత్పత్తుల నియంత్రణకు సంబంధించిన ‘కోట్పా’ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా పొగతాగే వారితో పాటు నిబంధనలకు విరుద్ధంగా అమ్మే వారు, ప్రచారం చేసే వారి పై కూడా చర్యలు తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment