ప్రాజెక్టులకు పునాది వేసింది టీడీపీ
► హరీశ్‌రావు నిద్ర చేస్తే ప్రాజెక్టులు పూర్తికావు
► నిరంజన్‌రెడ్డి వార్డుమెంబర్‌గా కూడా గెలవలేడు
మహబూబ్‌నగర్ క్రైం : పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణానికి పునాది వేసింది టీడీపీ హయాంలోనే అని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. జిల్లాలో రైతుల సంక్షేమం కోసం 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసి, ప్రారంభించారని అన్నారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ధనార్జననే ధ్యేయంగా కమీషన్లు వచ్చే పనులను ముందు చేసి అసలు ప్రాజెక్టులను నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న వాటిపై దృష్టి పెట్టకుండా కోట్ల రూపాయలు కమీషన్ల రూపంలో సంపాదించుకోవడానికి పాలమూరు ఎత్తిపోథల పథకం తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు.
మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టుల వద్ద ఒకరోజు రాత్రి నిద్రచేస్తే ప్రాజెక్టులు పూర్తికావు అనే విషయం తెలుసుకోవాలన్నారు. తెలంగాణలో గేట్లు ఎత్తితే ఆంధ్రాకు వెళ్లే నీళ్లకు చంద్రబాబు అడ్డుపడుతున్నాడని చెప్పాడం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలని, ఎవరూ అడ్డుపడకుండా తాము అక్కడ కట్టెలతో కావలి కాస్తామని అన్నారు. ఇటీవల అవాకులు చెవాకులు మాట్లాడుతున్న నిరంజన్‌రెడ్డికి వనపర్తిలో వార్డుమెంబర్‌గా కూడా గెలిచే సత్తాలేదని ఎద్దేవా చేశారు. ఈ మధ్య కాలంలో కేసీఆర్ వెళ్లివచ్చిన దేశానికే కొన్నిరోజుల తర్వాత కొడుకు వెళ్తున్నాడని, దీన్నిచూస్తే తండ్రి వ్యాపారం చూసి వస్తే కొడుకు పెట్టుబడులు పెట్టడానికి వెళ్తున్నాడని అనిపిస్తోందని అన్నారు. అనంతరం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ పేదల గుండెలో శాశ్వతంగా ముద్రపడిందని, దీన్ని చెరపడం ఎవరితరం కాదన్నారు.
మినీమహానాడు పరిశీలకుడు ఏకె.గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వాన్ని తండ్రి, కొడుకు, అల్లుడు, కూతురు నలుగురే నడిపిస్తున్నారని విమర్శించారు. మిగతా మంత్రులకు కనీస గౌరవం కూడా ఈ ప్రభుత్వంలో దక్కడంలేదని అన్నారు. దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సిములు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కమిటీ వేసుకొని పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.