తెలుగు తమ్ముళ్ల..అయోమయం! | TDP Leaders In Nalgonda District Looking To Join Other Parties | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 8 2018 11:05 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

TDP Leaders In Nalgonda District Looking To Join Other Parties - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఒకప్పుడు ఉమ్మడి నల్ల గొండ జిల్లాలో మెజారిటీ స్థానాల్లో ప్రాతినిధ్యం వహించిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితిలో ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జిల్లాలో ఆ పార్టీకి ప్రాతి నిధ్యమే లేకుండా పోయింది. రాష్ట్ర విభజన తర్వా త తెలంగాణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైనా, జిల్లా పార్టీని గాడిలో పెట్టేందుకు ఏ నాయకుడూ ప్రయత్నించలేదు.

దీనికితోడు పేరున్న నేతలతోపాటు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పార్టీని వీడి అధికార టీఆర్‌ఎస్‌లో కొందరు, కాంగ్రెస్‌ పార్టీలో మరికొందరు చేరిపోయారు. ఫలితంగా జిల్లా పా ర్టీని నడిపించే సమర్థమైన నాయకత్వం లేకుం డా పోయింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొ నే వ్యూహం కానీ, ఆ శక్తి ఉన్న నాయకుడు కానీ జిల్లా టీడీపీకి లేకుండా పోయారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో తమ్ముళ్లు అయోమయంలో చిక్కుకున్నారు.

వలసలతో చిక్కిశల్యం..
పూర్వపు నల్లగొండ జిల్లాలో టీడీపీలో సమర్థులైన నాయకులుగా పేరున్న వారు ఒక్కరూ ఇప్పుడు పార్టీలో లేరు. మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వర రావు, వేనేపల్లి చందర్‌రావు పార్టీని వీడారు. ఇన్నాళ్లూ పార్టీ అంటిపెట్టుకుని పెద్ద దిక్కుగా వ్యవహరిం చిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఎం దులోనూ చేరకున్నా, పార్టీకి దూరమయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిం చిన బిల్యా నాయక్, జిల్లాల విభజన తర్వాత సూ ర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పటేల్‌ రమేష్‌రెడ్డి, భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిం చిన ఉమా మాధవరెడ్డి తనయుడు అంతా ఒక్కొక్కరే టీడీపీని వీడారు.

మరోవైపు జిల్లా కేంద్రంలో పార్టీకి దిక్కుగా ఉండిన కంచర్ల భూపాల్‌రెడ్డి సైతం కొద్ది నెలల కిందట గులాబీ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి నల్లగొండలో సుదీర్ఘ కాలం టీడీపీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన బడుగుల లింగయ్య యాదవ్‌ టీఆర్‌ఎస్‌లో చేరడం, రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇలా ఏ నియోజకవర్గం తీసుకున్నా టీడీపీ పేరున్న నాయకుడే లేకుండా పోయారు. దీనికి తగ్గట్టే తెలంగాణ టీడీపీ నాయకత్వం సైతం జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టిన దాఖలాలూ లేవు. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కంటే, తమ రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయం చూసుకోవడం మంచిదన్న అభిప్రాయంలో ప్రస్తుతం ఉన్న కొందరు నాయకులు భావిస్తున్నారని చెబుతున్నారు.

ఎన్నికల సారథి ఎవరు?
ఇప్పటికీ టీడీపీ జిల్లాలో కొంత ఓటు బ్యాంకు పదిలంగా ఉందని ఆ పార్టీ నాయకత్వం చెబుతోంది. నాయకులు పార్టీ మారినా అభిమానులు, ఓటర్లు మాత్రం చెక్కుచెదరలేదని వీరు పేర్కొంటున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎదురు చూస్తున్న నాయకులూ లేకపోలేదు. గతంలో టీడీపీ ఉమ్మడి జిల్లాలో దేవరకొండ, మునుగోడు మినహా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో మినహా భువనగిరిలో పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీదే విజయం. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పార్టీలో మిగిలి ఉన్న నాయకులు ఈ సారి ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు.

నల్లగొండలో మాదగోని శ్రీనివాస్‌ గౌడ్, కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్, ఆలేరులో బండ్రు శోభారాణి, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పేర్లు. హుజూర్‌నగర్‌లో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వంగాల స్వామిగౌడ్‌ తనకు అనువైన స్థానం కోసం వెదుకులాటలో ఉన్నారని చెబుతున్నారు. ఎన్నికల్లో జిల్లాలో పార్టీని గట్టెక్కించేందుకు సారథ్యం వహించే నాయకుడు ఎవరన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారు లేరు. రాష్ట్ర పార్టీ నుంచి సరైన మార్గదర్శనం వహించే వారు లేకపోవడం, జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహిరించి అన్నీ తానై చూసుకునే నాయకత్వం లేకపోవడంతో టీడీపీ కేడర్‌ పూర్తిగా అయోమయంలో పడిపోయిందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement