
మమ్మల్ని ప్రలోభపెట్టారు
* ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు
* నిజానిజాలు తేలితే సీఎం జైలుకెళ్లడం ఖాయం
* ఏసీబీ విచారణ సంతృప్తికరంగా లేదు
* సమస్యల పరిష్కారంలో గవర్నర్ విఫలం
* ఆరోపణలు గుప్పించిన ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లో చేరాలని తమ పార్టీ ఎమ్మెల్యేలను తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రలోభపెట్టి ఐదుగురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ముగ్గురు నేతల కాల్ డేటా విచారిస్తే నిజాలు తేలుతాయని పేర్కొన్నారు. బుధవారం రాత్రి పార్టీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, గాంధీ, రాజేందర్‌రెడ్డి, వివేకానందతో కలసి బంజారాహిల్స్‌లోని ఏసీబీ హెడ్‌క్వార్టర్స్‌లో ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ను కలిసేందుకు వెళ్లారు. ఆయన లేకపోవడంతో ఏసీబీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, వివేకానంద తరఫున ఫిర్యాదు అందజేశారు. టీఆర్‌ఎస్‌లో చేరాల్సిందిగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తమను ప్రలోభపెట్టారని ఇద్దరు ఎమ్మెల్యేలు తమ ఫిర్యాదులో పేర్కొం టూ ఏయే తేదీల్లో తమకు ఫోన్లు వచ్చాయో వెల్లడించారు.
అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. విచారణ పేరుతో ఏసీబీ ఏకపక్షంగా టీడీపీ నేతలను వేధిస్తోందని ఆరోపించారు. టీడీపీ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి, కాంట్రాక్టు, డబ్బు ఎరచూపి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారన్నారు. మాధవరం కృష్ణారావుకు డబ్బిచ్చి ఎస్కార్ట్‌లో పంపించారని ఆరోపించారు. చిత్తశుద్ధితో ఏసీబీ దర్యాప్తు చేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఏసీబీ దర్యాప్తు సీఎం కనుసన్నల్లో నడుస్తోందని ఎర్రబెల్లి ఆరోపించారు. ఏసీబీ డీజీ కేసీఆర్‌కు అనుకూలంగా నడుస్తున్నారని విమర్శించారు. ఇరు రాష్ట్రాల మధ్య గొడవను పరిష్కరించడంలో గవర్నర్ విఫలమయ్యారని, ఆయన తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకే తమపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. అనంతరం చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్‌రెడ్డిని ఆయన పరామర్శించారు.