నల్లగొండ : జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అసలు ఏం జరుగుతోంది...? ఉపాధ్యాయ బది లీలు, పోస్టుల హేతుబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ జారీచేసి మూడు రోజులు దాటి నా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. షెడ్యూల్ ప్రకారం పోస్టుల హేతుబద్ధీకరణ ఈ నెల 22వ తేదీ నాటికి పూర్తిచేసి అదే రోజున ఖాళీల వివరాలు ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలకు అనేక అవరోధాలు అడ్డొస్తున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మిగులు పోస్టులను గుర్తించే ప్రక్రియ వేగంగానేపూర్తయినప్పటికీ ఆ తర్వాత జరగాల్సిన మిగతా కార్యక్రమాలు నె మ్మదించాయి.
వివాదస్పదమైన అంశాలకు కేంద్ర బిందువుగా మారుతున్న విద్యాశాఖ...గతంలో చేపట్టిన బదిలీలు, రేషనలైజేషన్ విధానంలో అనేక విమర్శలు ఎదుర్కొంది. దీంతో ప్రస్తుతం చేపడుతున్న బదిలీలు, రేషనలైజేషన్ అత్యంత పకడ్బందీగా చేయాలని భావిస్తున్నప్పటికీ శాఖాపరమైన సమస్యలు వేధిస్తున్నట్లు తెలుస్తోంది. డీఈఓ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగుస్తుడడంతో ఎలాంటి విమర్శలకూ తావులేకుండా బదిలీలు పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించేలా కనిపించకపోవడంతో ఆయనకు ఎటూ పాలుపోవడం లేదు.
శాఖపరమైన సవాళ్లు....
రేషనలైజేషన్ వ్యవహారం అంత ఆషామాషీగా ఉండదనేది ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం. గతంలో కాకుండా ఇప్పుడు మారిన మార్గదర్శకాల ప్రకారం చేయాలంటే అందుకు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల సహకారం చాలా అవసరం. కానీ డీఈఓ కార్యాలయంలో తాజా పరిస్థితులను పరిశీలిస్తే ఇద్దరు ఏడీలు ఉన్నప్పటికీ వారినుంచి ఎలాంటి సాయమూ పొందలేని స్థితిలో అధికారులు ఉన్నారు. గతంలో అనుభవం కలిగిన కొంతమంది ఉద్యోగులు ఉన్నప్పటికీ వారిని వేర్వేరు విభాగాలకు మార్చారు. దీంతో ఒకరిద్దరుపైనే ఆధారపడాల్సి వస్తోంది. రేషనలైజేషన్, ఖాళీల గుర్తింపు, పోస్టుల సర్దుబాటు ఇవన్నీ కూడా ఒకరిద్దరు చేతుల మీదుగానే నడుస్తోంది.
దీంతో రేషనలైజేషన్ కసరత్తు షెడ్యూల్ ప్రకారం పూర్తవుతుందా..! అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉంటే బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించడం విద్యాశాఖకు పెనుసవాల్‌గా మారింది. జిల్లాలో భువనగిరి మినహా నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ డివి జన్‌ల డిప్యూటీ డీఈఓల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. చిలుకూరు మండలం మినహా మిగిలిన 58 మండలాలకు హెచ్‌ఎంలే ఇన్‌చార్జ్ ఎంఈఓలుగా వ్యవహరిస్తున్నారు. అదీగాక ఈసారి వినూత్నరీతిలో బదిలీల కౌన్సెలింగ్ జిల్లా కేంద్రంలో ఒకేచోట కాకుండా నాలుగు చోట్ల చేయాలని యోచిస్తున్నారు. ఇలాంటి సం క్లిష్ట పరిస్థితులను దాటుకుని కౌన్సెలింగ్ సజావుగా సాగుతుందా...! అన్నదే ప్రశ్నార్థకమే.
స్పందించని డీఈఓ..
ఓ వైపు బదిలీల కసరత్తు జరుగుతుండగానే మరోవైపు పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. డీఈఓకు అదనంగా రాజీవ్ విద్యామిషన్ పీఓ బాధ్యతలు ఉన్నాయి. వీటిన్నింటినీ దాటుకుని ముందుకు పోయేందుకు ఆయన శత విధాలా ప్రయత్నిస్తున్నారు. శాఖాపరంగా కీలక పోస్టులు ఖాళీగా ఉండడం...కౌన్సెలింగ్, రేషనలైజేషన్ చేపట్టడంలో అనుభవం కలిగిన ఉద్యోగులు, అధికారులు సరిపడా లేకపోవడంతో డీఈఓ మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన కొద్ది రోజులుగా బయటి వ్యక్తులనుంచి వస్తున్న ఫోన్‌లకు ఎలాంటి స్పందన ఇవ్వడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదు చేస్తున్నాయి. బదిలీలకు సంబంధించిన ఎలాంటి సమాచారం కూడా బయటకు పొక్కనివ్వకుండా గుట్టచప్పుడు కాకుండా చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అధికారిక సెల్‌నంబర్‌కు ఎవరు కాల్‌చేసినా తప్పని సరిగా స్పందించాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. కానీ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న డీఈఓ అత్యవసరమని భావించిన ఫోన్‌కాల్స్‌కు మాత్రమే స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం అనుకున్న విధంగా ముందుకు సాగాలంటే కలెక్టర్ దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.
అంతా గోప్యం
Published Thu, Jun 18 2015 10:48 PM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM
Advertisement