బదిలీల్లో డీఈవోల అక్రమాలు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో డీఈవోలు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. కౌన్సెలింగ్‌లో కొన్ని ముఖ్యమైన పోస్టులను చూపకుండా అవినీతికి బాట వేసుకున్నారు. ముడుపులు ఇచ్చినవారికి, రాజకీయ పలుకుబడి ఉన్నవారికి తొలుత ఓ చోట పోస్టు ఇచ్చారు. కౌన్సెలింగ్ పూర్తయ్యాక ఆర్డర్లను మార్చేసి.. దాచిపెట్టిన పోస్టుల్లో ‘తమ’వారిని నియమించేసుకున్నారు. కౌన్సెలింగ్ సమయంలోనూ ముందు వచ్చిన సీనియర్ టీచర్లకు కొన్ని ఖాళీ పోస్టులను చూపకుండా... ఆ తర్వాత వచ్చిన‘తమ’వారికి కట్టబెట్టేసుకున్నారు.
ఇప్పుడీ వ్యవహారం బయటకు పొక్కడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే వరంగల్ డీఈవోపై వచ్చిన ఆరోపణలపై విద్యాశాఖ శాఖాపరమైన విచారణ చేపట్టింది. అక్కడ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఏడుగురు టీచర్లకు సంబంధించి బదిలీలు పూర్తయ్యాక... వెళ్లాల్సిన స్థానాలను మార్చేసినట్లు తేలింది. దీంతో ఆయనపై శాఖాపరమైన చర్యల కోసం గురువారం విద్యాశాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది.
ఒకటీ రెండు రోజుల్లో ఆయనపై చర్యలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. మెదక్ డీఈవోపైనా తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయనపై శుక్రవారం విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ముడుపుల బాగోతమే అక్కడి అక్రమాలకు కారణమని తెలిసింది. అలాగే హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ ముడుపులు ముట్టజెప్పిన వారికి నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అన్ని చోట్లా: హైదరాబాద్ జిల్లాలో ఒక టీచర్ తనకు గతంలో అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లగా... దీనిని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు విద్యాశాఖకు సూచించింది. అయితే ప్రస్తుత జాబితాలో ఆ టీచర్ కంటే సీనియర్లు ఉన్నప్పటికీ పదోన్నతి కల్పించినట్లు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు గత నెల 12తో పదోన్నతుల ప్రక్రియ ముగిసినా... 13న కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్న మరో టీచర్‌కు 12వ తేదీతో 16న పదోన్నతి ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొంటున్నాయి. ఇక ఏ మేనేజ్‌మెంట్ టీచర్లకు ఆ మేనేజ్‌మెంట్‌లోనే పదోన్నతులు కల్పించాల్సి ఉన్నా కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలోని పోస్టుల్లోకి జిల్లా పరిషత్ టీచర్లను బదిలీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
డీఈవోలు ముడుపులు పుచ్చుకుని ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ మండలంలో స్పౌజ్ కేటగిరీలో వచ్చిన ఓ టీచర్‌కు ఆమె కోరుకున్న స్థానాన్ని ఇవ్వలేదు, ఖాళీ లేదని చెప్పి పక్కనున్న మండలంలో పోస్టింగ్ ఇచ్చారు. కానీ ఈ ఖాళీ లేదన్న స్థానాన్నే ఆ తరువాత మరో టీచర్‌కు ఇచ్చారు. మరో మండలంలో ఎస్సీ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయ పోస్టును తమకు ముడుపులిచ్చిన వారి కోసం ఓసీ పోస్టుగా మార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటన్నింటి నేపథ్యంలో మిగతా జిల్లాల్లోని డీఈవోలపై వచ్చిన ఆరోపణలపైనా శాఖాపర విచారణకు విద్యాశాఖ సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున కడియం శ్రీహరి ఈ అక్రమాలపై సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.