
సాక్షి, రాజేంద్రనగర్ : అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థుల ఎదుటే నోటికి వచ్చిన బూతులు తిట్టుకున్నారు. పరస్పరం ఒకరిపైఒకరు సెల్‌ఫోన్లతో దాడులు చేసుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు చేరుకోని ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల జోక్యంతో కథ సాయంత్రానికి రాజీకి వచ్చింది.రంగారెడ్డి జిల్లా గండిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రాధానోపాధ్యాయుడిగా రాములు, ఉపాధ్యాయురాలిగా కె.మనోరమ విధులు నిర్వహిస్తున్నారు. సో మవారం ఉదయం మనోరమ 8.55 నిమిషాలకు బడికి చేరుకున్నారు.
అప్పటికే ప్రధానోపాధ్యాయుడు రాములు ప్రార్థన నిర్వహించి విద్యార్థులను తరగతి గదుల్లోకి పంపించారు. అయితే, నిత్యం 9.15 నిమిషాలకు ప్రార్థన ముగించాల్సి ఉండగా ముందే ఎందుకు నిర్వహించారని మనోరమ హెచ్‌ఎంను ప్రశ్నించారు. ఈ విషయమై ఇరువురి మధ్య మాటల యుద్ధం జరిగింది. మనోరమ తన చేతులో ఉన్న సెల్‌ఫోన్‌ను విసిరికొట్టారు. అది రాములు వద్ద పడడంతో ఆయన తనపై ఎందుకు విసురుతున్నావు.. అంటూ అదే సెల్‌ఫోన్‌ను మనోరమ వద్దకు విసిరాడు. విద్యార్ధుల ఎదుటే ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం దూషించుకున్నారు. ఇతర సిబ్బంది వారిని సముదాయించారు. ఈ విషయమై టీచర్ మనోరమ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని విచారించారు. విషయం తెలుసుకున్న ఎంఈఓతో పాటు ఇతర ఉపాధ్యాయులు వారిని సముదాయించి రాజీ కుదిర్చారు.
Comments
Please login to add a commentAdd a comment