
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త శాసనసభ గురువారం కొలువుదీరనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం మొట్టమొదటిసారిగా భేటీ అవుతున్న ఈ సభలో మన జిల్లా నుంచి ఎనిమిది ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014లో 14 మంది శాసనసభ్యులుండగా.. జిల్లాల పునర్విభజనతో ఈ సంఖ్య కుచించుకుపోయింది.
ఇందులో కల్వకుర్తి ఎమ్మెల్యే అటు నాగర్‌కర్నూలు, ఇటు రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇదిలాఉండగా, కేవలం సభాపతి, ఉప సభాపతి ఎంపిక, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలకే పరిమితం చేసిన ఈ సమావేశాల్లో.. ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం లేదు. కాగా, జిల్లా నుంచి గెలుపొందిన శాసనసభ్యులంతా పాత కాపులే కావడం గమనార్హం. గత ఎన్నికల్లో ఓడిపోయిన దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్ ఈసారి విజయం సాధించగా.. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి కూడా తాజా ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు.
దీంతో జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు పాత ముఖాలేనని చెప్పుకోవచ్చు. అయితే, శాసనసమండలి సమావేశాల్లో మాత్రం మన జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇరువురు సభ్యులు దూరమయ్యారు. స్థానిక సంస్థల కోటాలో గెలుపొందిన నరేందర్‌రెడ్డి.. కొడంగల్ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అలాగే, ఎన్నికల వేళ పార్టీ ఫిరాయించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై అనర్హత వేటు పడింది. దీంతో ఈ రెండు పోస్టులకు ప్రాతినిథ్యం లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment