నేడు ఢిల్లీకి రాజీవ్‌శర్మ
ఏపీ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేయనున్న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
కేంద్రం దృష్టికి నిధులు, విద్యుత్ సహా పలు అంశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య పలు అంశాల్లో వివాదం మళ్లీ ఢిల్లీకి చేరనుంది. ఇటీవలే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి, నీటి వినియోగానికి సంబంధించి కేంద్ర మంత్రులు ఉమా భారతి, పీయూష్ గోయల్‌కు మంత్రి హరీశ్‌రావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్‌శర్మ శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళుతున్నారు. అక్కడ ప్రధాని కార్యాలయం, కేబినెట్ సెక్రటరీ, హోంశాఖ కార్యదర్శులతో సమావేశం కానున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... రాష్ట్ర విభజన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని కేంద్రానికి సీఎస్ ఫిర్యాదు చేయనున్నారు. ఇటీవల వరుసగా జరుగుతున్న పలు సంఘటనలతో పాటు విద్యుత్, శ్రీశైలం జల వినియోగం తదితర అంశాలను కేంద్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురానున్నారు. ప్రధానంగా విభజన చట్టం తొమ్మిదో, పదో షెడ్యూళ్లలోని వివిధ సంస్థలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో సమస్యలు వస్తున్నాయని స్పష్టం చేయనున్నారు. ఉమ్మడి రాష్ట్ర ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్న నిధులను ప్రస్తుతం ఏపీ అధికారులు తెలంగాణకు సమాచారం ఇవ్వకుండా కొత్త ఖాతాల్లోకి మార్చేస్తున్నారని... దీంతో తెలంగాణకు అందాల్సిన వాటా రాని పరిస్థితులు నెలకొంటున్నాయని వివరించనున్నారు.
ఇంతకుముందు కూడా రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి సంబంధించిన నిధులను ఆ రాష్ట్ర అధికారులు ఏపీలోని బ్యాంకులకు తరలించడంపై ఆధారాలతో కేంద్రం దృష్టికి తీసుకుని రానున్నారు. ఇక పదో షెడ్యూల్‌లో ఉన్న సంస్థల్లోని నిధులను.. ఏపీ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా లాగేయడంతోపాటు, పాలనా వ్యవహారాల్లో ఇబ్బందులు సృష్టిస్తోందని రాజీవ్‌శర్మ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. కృష్ణపట్నం, సీలేరు ప్రాజెక్టుల విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వడం లేదన్న విషయాన్ని కూడా వివరించనున్నారు. ఐఏఎస్‌ల విభజనకు సంబంధించి కూడా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని.. శాఖాధిపతులు లేక పాలనపై ప్రభావం పడుతోందని కేంద్ర కేబినెట్ కార్యదర్శిని రాజీవ్‌శర్మ కోరనున్నారు.