* మంత్రివర్గంలో చేరిన తుమ్మల, తలసాని, జూపల్లి, లక్ష్మారెడ్డి, చందూలాల్, ఇంద్రకరణ్‌రెడ్డి
* రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం
* సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల హాజరు
* కొత్త వారికి శాఖలు కేటాయించిన ముఖ్యమంత్రి
* తుమ్మలకు రోడ్లు, భవనాలు, తలసానికి వాణిజ్య పన్నులు
* ఇంద్రకరణ్‌రెడ్డికి గృహ నిర్మాణం, లక్ష్మారెడ్డికి విద్యుత్
* జూపల్లికి పరిశ్రమలు, చందూలాల్‌కు గిరిజన సంక్షేమం
* ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాని అసంతృప్తులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోకి సీఎం కె. చంద్రశేఖర్‌రావు కొత్తగా ఆరుగురిని తీసుకున్నారు. తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఆజ్మీరా చందూలాల్, సి. లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుకు కేబినెట్‌లో చోటు కల్పించారు. రాజ్‌భవన్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు నిరాడంబరంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వీరితో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. కేసీఆర్‌తో పాటు రాష్ర్ట మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత గవర్నర్, సీఎంతో కలిసి మంత్రులంతా గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. మంత్రులతో పాటు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. దుబాయ్ పర్యటన ముగించుకుని మంగళవారమే హైదరాబాద్ చేరుకున్న మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.
కాగా, టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన హైదరాబాద్ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సాంకేతికంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ పని చేశారు. ఉప ఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్ తరఫున మళ్లీ పోటీ చేయనున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. మంత్రి పదవులను ఆశించి భంగపడిన చాలామంది ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనలేదు. చీఫ్ విప్ పదవితోనే సరిపెట్టుకున్న కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఏనుగు రవీందర్ రెడ్డి, గంప గోవర్ధన్, జలగం వెంకట్‌రావు, వి.శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఈ కార్యక్రమానికి దూరంగానే ఉన్నారు.
సాయంత్రానికి శాఖల కేటాయింపు
కొత్త మంత్రులకు సాయంత్రానికల్లా శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీని విడిచి అధికారపార్టీలో చేరిన ఖమ్మం జిల్లా నేత తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు భవనాల శాఖ, తలసానికి వాణిజ్య పన్నుల శాఖ దక్కింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు కూడా కీలక శాఖలను సీఎం కేటాయించారు. జూపల్లి కృష్ణారావుకు పరిశ్రమలు, లక్ష్మారెడ్డికి విద్యుత్ శాఖను అప్పగించారు.
ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీ తరఫున గెలిచి, తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన ఇంద్రకరణ్ రెడ్డికి గృహనిర్మాణం, వరంగల్ జిల్లాకు చెందిన అజ్మీరా చందూలాల్‌కు గిరిజనసంక్షేమ శాఖను కేటాయించారు. కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలన్నీ ఇప్పటిదాకా ముఖ్యమంత్రి వద్ద ఉన్నవే . కాగా, ఎకై్సజ్ మంత్రి టి.పద్మారావుకు అదనంగా క్రీడలు, యువజన సర్వీసులను, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్నకు అదనంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాధ్యతలను కూడా కట్టబెట్టారు. కొత్తగా చేరిన ఆరుగురు మంత్రులతో రాష్ర్ట కేబినెట్ పరిమాణం సీఎం సహా 18కి చేరింది.
కొత్త మంత్రుల శాఖలు
తుమ్మల నాగేశ్వర్‌రావు: రోడ్లు, భవనాలు, మహిళా, శిశుసంక్షేమం
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి: గృహ నిర్మాణం, న్యాయ, దేవాదాయ
తలసాని శ్రీనివాస్‌యాదవ్: వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ
సి.లక్ష్మారెడ్డి: విద్యుత్ శాఖ
జూపల్లి కృష్ణారావు: పరిశ్రమలు
అజ్మీరా చందూలాల్: గిరిజన సంక్షేమం
కొత్త మంత్రులొచ్చారు
Published Wed, Dec 17 2014 1:49 AM | Last Updated on Sat, Aug 11 2018 6:56 PM
Advertisement
Advertisement