
ప్రాజెక్టులపై జీఎస్టీ అన్యాయం
కేంద్ర ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తాం: ముఖ్యమంత్రి కేసీఆర్
► నిర్మాణంలోని సాగు, తాగునీటి ప్రాజెక్టులపై పన్ను సరికాదు
► దీనితో తెలంగాణకు రూ.19 వేల కోట్ల నష్టం
► కేంద్రం ఏకపక్ష తీరును నిలదీస్తాం
► వెంటనే నిర్ణయాన్ని మార్చుకోవాలి
► నేడు ప్రధాని మోదీకి లేఖ రాయనున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్
ఇప్పటికే ప్రారంభమై నిర్మాణంలో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులకు కూడా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విధించాలన్న కేంద్ర ప్రభుత్వం, జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేశారు. నిర్మాణంలోని ప్రాజెక్టులపై 12 శాతం జీఎస్టీ విధించడం వల్ల తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆదివారం ప్రధాని మోదీకి లేఖ రాయాలని నిర్ణయించారు. అంతేగాకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపై న్యాయ పోరాటం చేయాలని యోచిస్తున్నారు.
ప్రాజెక్టులపై పన్ను వద్దు..
సాగునీరు, తాగునీటి పథకాలు, గృహ నిర్మాణం, రహదారుల నిర్మాణం వంటి వాటిపై జీఎస్టీ విధించవద్దని రాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచీ డిమాండ్ చేస్తోంది. గతంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. శనివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన మంత్రి కేటీఆర్.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రజోపయోగ పథకాలకు జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ నాలుగు అంశాలపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సైతం ఈ 12 శాతం జీఎస్టీ వర్తిస్తుందని పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఓ ప్రకటనలో తీవ్రంగా వ్యతిరేకించారు. పురోగతిలో ఉన్న ప్రాజెక్టులకు జీఎస్టీని వర్తింపజేయడం అన్యాయమని స్పష్టం చేశారు.
రాష్ట్రానికి భారీగా నష్టం
జీఎస్టీ అమల్లోకి వచ్చిన జూలై ఒకటో తేదీ కన్నా ముందే ప్రారంభమై కొనసాగుతున్న ప్రాజెక్టులకు కూడా జీఎస్టీ వర్తింపజేయడంతో తెలంగాణకు ఏకంగా రూ.19 వేల కోట్లు నష్టం జరుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాలూ నష్టపోతాయని.. దీనిని జాతీయ సమస్యగా పరిగణించాలని పిలుపునిచ్చారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయం కావడం వల్ల అమలు చేయటం కూడా సమస్యగా మారుతుందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల వ్యయాన్ని బడ్జెట్‌లో పొందుపర్చాల్సి ఉంటుందని.. జీఎస్టీ వర్తింపు వల్ల పెరిగే అంచనా వ్యయాలను బడ్జెట్‌లో పొందుపర్చలేమన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.