సాక్షి, వరంగల్ రూరల్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మొదటి ఘట్టం నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 72 మంది నామినేషన్లు వేయగా అందులో 11 మంది నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి. 61 మంది అభ్యర్థుల్లో 20 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 41 మంది బరిలో దిగుతున్నారు. ఇండిపెండెంట్‌లకు గుర్తులను కేటాయించనున్నారు.
జోరుగా బేరసారాలు..
నామినేషన్ల విత్‌డ్రాల కోసం ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు జోరుగా బేరసారాలు చేశారు. ఇండిపెండెంట్ల బరిలో ఉంటే ఓట్లు కోల్పోయే అవకాశం ఉంటుందని ఉపసంహరించుకునే విధంగా కృషి చేశారు. ఇప్పటివరకు అయిన ఖర్చు తామూ ఇస్తామంటూ చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లను మద్యవర్తులు రంగంలోకి దిగి మాట్లాడారు. కారులో ఎన్నికల రిటర్నింగ్ అధికారి దగ్గరకి తీసుకవెళ్లి దగ్గర ఉండి ఉపసంహరించుకునే విధంగా చేశారు. ఇంక కొంత మంది పార్టీల్లో పదవులు ఇచ్చి ఆ పార్టీ అధికారంలో రాగానే నామినేట్ పదవిని సైతం రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి ఇప్పిస్తామని హామీలు ఇచ్చారు.
జాగ్రత్త పడిన అభ్యర్థులు..
ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇతరుల నామినేషన్ల ఉపసంహరణకు వ్యయ ప్రయాసాలు పడ్డారు. ఒక్కో బ్యాలెట్ పత్రంలో 15 మందికే అవకాశం ఉంటుంది. దీంతో 15 మంది కంటే ఎక్కువ మంది బరిలో ఉంటే రెండు బ్యాలెట్లను పెట్టాల్సి వస్తుంది. దీంతో అప్రమత్తమైన అభ్యర్థులను పోటీలో నుంచి తప్పించేందుకు తీవ్రంగా కృషి చేశారు. రెండు బ్యాలెట్లు అయితే పేరు ఎక్కడ ఉంటుందోనని అప్రమత్తమయ్యారు.
పరకాల నియోజకవర్గంలో..
పరకాల నియోజకవర్గంలో 23 మంది నామినేషన్లు వేశారు. ఇద్దరివి తిరస్కరించబడ్డాయి. మొత్తం అభ్యర్థులు 21 ఉండగా అందులో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.చల్లా ధర్మారెడ్డి(టీఆర్‌ఎస్), కొండా సురేఖ(కాంగ్రెస్), డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి(బీజేపీ), పున్నం భాగ్యశ్రీ(ఇండియన్ న్యూ కాంగ్రెస్), దారం యువరాజు(సమాజ్‌వాది పార్టీ), ఈసంపెల్లి వేణు(ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్), ఇమ్మద్రి రవి(రిపబ్లికన్ పార్టీ), గోనె కుమారస్వామి(బీఎల్‌ఎఫ్), గుండా రాము(శివసేన), సింగారపు రాజు(బహుజన సమాజ్ పార్టీ), ఇండిపెండెంట్లు ఆడెపు రమేశ్, అబ్బిరెడ్డి బుచ్చిరెడ్డి, సాంబయ్య, కుమారస్వామి, ఉప్పుల శ్రీనివాస్‌లు ఉన్నారు.
నర్సంపేట నియోజకవర్గం..
నర్సంపేట నియోజకవర్గంలో 16 మంది నామినేషన్లు వేయగా ముగ్గురు అభ్యర్థుల దరఖాస్తుల తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 13 మంది అభ్యర్థులు ఉండగా అందులో ఇద్దరు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం బరిలో 11 మంది ఉన్నారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డి(టీఆర్‌ఎస్), దొంతి మాధవరెడ్డి(కాంగ్రెస్), ఎడ్ల అశోక్‌రెడ్డి (బీజేపీ), మద్దికాయల అశోక్(బీఎల్‌ఎఫ్), దయాకర్(బీ ఎస్‌పీ), కురుమల్ల రామ్మూర్తి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), దేవేందర్(సమాజ్‌వాది పార్టీ), ప్రేమ్‌లాల్(జై మహా భారత్ పార్టీ), పూర్ణచందర్(శివసేన), ఇండిపెండెంట్లు చిన్ని క్రిష్ణ, నాగేశ్వర్‌రావు, కిరణ్‌కుమార్, విష్ణుకుమార్, సుధీర్‌లు ఉన్నారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలో..
వర్ధన్నపేట నియోజకవర్గంలో 33 మంది నామినేషన్లు వేశారు. ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 27 మంది అభ్యర్థులుండగా అందులో 12 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇంకా 15 మంది బరిలో ఉన్నారు. అరూరి రమేశ్(టీఆర్‌ఎస్), కొత్త సారంగరావు(బీజేపీ), పగిడిపాటి దేవయ్య(టీజేఎస్), నరసింహస్వామి(బీఎల్‌ఎఫ్), గంధం శివ(బీఎస్పీ), నద్దునూరి సంపత్(ఎస్‌పీ), ఇండిపెండెంట్లు సుదీమల్ల వెంకటస్వామి, జెట్టి స్వామి, లెనిన్, నర్సయ్య, జనార్దన్, కమలాకర్, నగేష్, రమేశ్, శోభన్‌బాబులు బరిలో ఉన్నారు.
బరిలో 41 మంది
Published Fri, Nov 23 2018 6:46 AM | Last Updated on Wed, Mar 6 2019 8:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment