♦ జూన్ 2లోగా అమరావతికి వెళ్లేందుకు సిద్ధం కావాలని ఏపీ ఆదేశాలు
♦ ఏపీ నుంచి రిలీవ్ చేయాలని పది రోజులుగా నిరసనలు
సాక్షి, హైదరాబాద్: ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు ‘రాజధాని తరలింపు’ భయం పట్టుకుంది. జూన్ 2లోగా ఎప్పుడైనా ఏపీ నూతన రాజధాని అమరావతికి తరలివెళ్లాల్సి ఉంటుందని, ఇందుకు సిద్ధమై ఉండాలని ఏపీ విద్యుత్ సంస్థలు హైదరాబాద్‌లోని తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం తమ కార్యాలయాలను హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిస్తే తామూ వెళ్లకతప్పదని భయాందోళనలకు గురవుతున్నారు. ఏపీ విద్యుత్ సంస్థల్లో 360 మంది వరకు తెలంగాణ ప్రాంత ఉద్యోగులు కొనసాగుతున్నారు.
వీరిలో 170 మంది హైదరాబాద్‌లో, మిగిలిన వాళ్లు ఏపీలోని జోనల్ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. బలవంతంగా అమరావతికి తరలిస్తే... తెలంగాణ నుంచి రిలీవైన 1252 మంది ఏపీ ప్రాంత విద్యుత్ ఉద్యోగుల తరహాలోనే వీరూ రోడ్డున పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమను తక్షణమే ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు 10 రోజులుగా విద్యుత్‌సౌధలో ఆందోళనలు చేస్తున్నారు. మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. అయినా, రిలీవ్ చేసేందుకు ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి.
ఏపీలో కొనసాగుతుండడం వల్ల ఇప్పటికే తెలంగాణ ఇంక్రిమెంట్‌ను కోల్పోయామని తెలంగాణ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రిలీవ్ చేయకపోయినా తెలంగాణ ప్రభుత్వం పెద్ద మనసుతో ముందుకు వస్తే తామూ వచ్చేస్తామని ఓ ఉద్యోగి ‘సాక్షి’కి తెలిపారు. లేనిపక్షంలో ఉద్యోగుల విభజన వివాదం పరిష్కారమయ్యే వరకు అమరావతిలో పనిచేయక తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడికి వెళ్లి పనిచేయడం సాధ్యం కాదన్నారు. ఏపీలోని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులను తీసుకుంటారా? అని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డిని బుధవారం విలేకరులు ప్రశ్నించగా చట్టపర చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.