పంటరుణాలకు.. ముగిసిన గడువు
నల్లగొండ అగ్రికల్చర్ : రైతు రుణాలు మాఫీ చేసి తిరిగి రుణాలను ఇప్పిస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కేవలం 25 శాతం నిధులు రూ.633 కోట్లను మాత్రమే బ్యాంకులలో జమచేసి అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు రుణాలను మాఫీ చేస్తుందన్న భరోసాతో రైతులు బ్యాంకులకు రుణాలను చెల్లించకుండా జాప్యం చేశారు. ప్రభుత్వం కూడా రుణమాఫీపై సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో బ్యాం కులు రుణాలను ఇవ్వకుండా మొండికేశాయి. సెప్టెంబర్ 30 వరకు ఖరీఫ్ పంట రుణాల చెల్లింపునకు గడువు ఉన్నప్పటికీ బ్యాంకులు రుణాలను ఇవ్వకుండా నిరాకరిస్తూ జాప్యం చేయడంతో అధికారులు ఈ నెల 15 వరకు రుణాలను చెల్లించడానికి గడువు పెంచారు. జిల్లాలో ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.1126 కోట్లకు గాను బుధవారం గడువు ముగిసే నాటి వరకు రూ.672.76 కోట్లను 1,51,452 మంది రైతులకు మ్రాతమే బ్యాంకర్లు పంట రుణాలను మంజూరు చేశారు. ఇందులో రాష్ర్ట ప్రభుత్వం రుణాల మాఫీలో భాగంగా బ్యాంకులలో జమచేసిన నిధులనే రైతులకు రుణాలుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా గత ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.1011.80 కోట్లకు గాను రికార్డు స్థాయిలో రూ.1041.56 కోట్లు మంజూరు చేయడం గమనార్హం.
ఫలించని ప్రయత్నాలు..
ఖరీఫ్‌లో పూర్తి స్థాయిలో రైతులకు పంటరుణాలను ఇప్పించడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక బృందాలను నియమించింది. ఇందులో రెవెన్యూ, వ్యవసాయ శాఖతో పాటు బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు. గ్రామాల వారీగా పర్యటించి క్షేత్ర స్థాయిలో అర్హులైన రైతులను గుర్తించి ఆయా బ్యాంకుల వారీగా జాబితాలను సిద్ధం చేసి వారందరికీ రుణాలను ఇప్పించే బాధ్యతలను అప్పగించారు. ఆయా బృందాలు గత 20 రోజులుగా గ్రామాలలో పర్యటించి అర్హులైన జాబితాలను రూపొందించి ఇచ్చినప్పటికీ ఆశించిన ఫలితం రాకుండా పోయింది.
వడ్డీవ్యాపారులను ఆశ్రయించిన రైతులు
బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకుండా జాప్యం చేయడంతో అన్నదాతలు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను, ఫైనాన్స్‌లను ఆశ్రయించక తప్పలేదు. ప్రస్తుత ఖరీఫ్‌లో సాదారణ సాగు 4లక్షల 83 వేల హెక్టార్లకు గాను సుమారు 5లక్షల హెక్టార్లలో పత్తి, వరితో పాటు ఇతర పంటలను సాగు చేశారు. దీని కోసం నూటికి రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీలను చెల్లించడానికి సిద్దపడి కోట్లాది రూపాయలను అప్పు లు చేసి పెట్టుబడులను పెట్టారు.