
సాక్షి, హైదరాబాద్: జూన్ 2వ తేదీన హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌లో జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుక ఏర్పాట్లను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి మంగళవారం పరిశీలించారు. పబ్లిక్ గార్డెన్‌లోని సెంట్రల్ పార్కులో జరుగుతున్న పచ్చిక పనులు, ఇతర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. పార్కుకు ప్రతిరోజూ సుమారు 15వేల నుంచి 20వేల మంది మార్నింగ్ వాక్‌కు వస్తున్నారని, మరో 6వేల మంది సందర్శకులు వస్తున్నట్లు అధికారులు వివరించారు.
పబ్లిక్ గార్డెన్‌కు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని పచ్చదనం పెంచేందుకు ఉద్యానవన శాఖ చేస్తున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. నిజాం హయాంలో నిర్మించిన ముఖద్వారం సుందరీకరణ, పోకిరీలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు తదితరాలను పరిశీలించారు. పార్కు సందర్శకులపై నియంత్రణ, ఇతర పనుల కోసం నిధులు తదితరాల కోసం ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఉద్యాన శాఖ అధికారులను పార్థసారథి ఆదేశించారు. ఉద్యానవన శాఖ సంచాలకుడు ఎల్.వెంకట్‌రాంరెడ్డి, ఇతర అధికారులు అవతరణ దినోత్సవ వేడుకలను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment