
విద్యాసాగర్‌రావుకు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్: నీటిపారుదల రంగ నిపుణుడికి అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. జలసాగరుడిని కడసారిగా చూసేందుకు హైదరాబాద్ హబ్సిగూడలోని ఆయన నివాసానికి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ఉద్యమసహచరులు, బంధుమిత్రులు పెద్దఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ ముఖ్య సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు పార్థివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించారు.
ఆయన కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి విదితమే. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీమంత్రి ఎమ్మెల్యే డీకే అరుణ, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తదితరులు విద్యాసాగర్‌రావు భార్య సుజాత, కుమారుడు రమణలను పరామర్శించారు.
ఆదివారం ఉదయం 9 గంటలకు హబ్సిగూడ నుండి ప్రత్యేక వాహనంలో పార్థివదేహాన్ని అంబర్‌పేట హిందూ శ్మశానవాటికకు తరలించారు. అంతిమయాత్రలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజా, కులసంఘాల ప్రతినిధులు, బంధుమిత్రులు, తెలంగాణ ఉద్యమ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వ హించారు. సంతాప సూచకంగా పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్చారు. విద్యా సాగర్‌రావు చితికి కుమారుడు రమణారావు నిప్పంటించారు.
ప్రముఖుల నివాళి
విద్యాసాగర్‌రావు అంత్యక్రియల్లో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. అంత్యక్రి యల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు, తెలంగాణ జలవనరుల విభాగం చైర్మన్ వి.ప్రకాశ్, ప్రజాగాయకుడు గద్దర్, విరసం నేత వరవరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, బీసీ కమీషన్ చైర్మన్ బీఎస్ రాములు, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
సురవరం సంతాపం
తెలంగాణ జలవనరుల విషయంలో ప్రత్యేక కృషి చేసిన సాగునీటిరంగ నిపుణుడు విద్యా సాగర్‌రావు మృతి పట్ల సీపీఐ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకరరెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. రెండు దశాబ్దాలకు పైగా తనకు ఆయనతో పరిచయం ఉందని, తెలంగాణ ఉద్యమంలో తెరవెనక గొప్ప కృషి చేశారని, ప్రొఫెసర్ జయశంకర్‌కు కుడి భుజంగా నిలిచారని నివాళి అర్పించారు.