1969 తెలంగాణ ఉద్యమకారుడికి రూ.10 లక్షల సహాయం
జైళ్లకు వెళ్లిన వారికి పింఛన్లు ఇవ్వడం వీలుకాదు: నాయిని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి విడత ఉద్యమంలో పాల్గొని పోలీసు కాల్పుల్లో గాయపడ్డ సికింద్రాబాద్‌కు చెందిన పగడాల పరంధాములుకు ప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పరంధాములుకు చెక్ అందజేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ రాష్ట్రం కోసం తొలి, మలి ఉద్యమాల్లో త్యాగాలు చేసినవారి సేవలను ప్రభుత్వం మరువదన్నారు.
తెలంగాణ కోసం అసువులు బాసిన ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకునే కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని, ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించారన్నారు. ఆయా కుటుంబాల్లో అర్హులకు ఉద్యోగాలు కూడా ఇస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైళ్లకు వెళ్లిన వారికి పింఛన్లు అందజేయాలన్న డిమాండ్ ఉన్నా, అది సాధ్యం కాదన్నారు. 1969లో, 2001 తరువాత జరిగిన మలి ఉద్యమంలో వేలాది మందిపై కేసులు నమోదై అరెస్టయ్యారని తెలిపారు.
అప్పట్లో బడులే జైళ్లుగా మారాయన్నారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో 1975 ఎమర్జెన్సీ కాలంలో జైళ్లకు వెళ్లిన వారికి పింఛన్లు అందజేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పరంధాములుకు 1969లో జనరల్ బజార్‌లో జరి గిన కాల్పుల్లో రెండు తూటాలు శరీరంలోకి వెళ్లాయని, ఆయన ఈ విషయాన్ని తన దృష్టికి తేవడంతో సీఎంకు చెప్పి ఆర్థిక సాయాన్ని మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరంధాములు సతీమణి సత్యలీల పాల్గొన్నారు.