రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు రైట్‌ రైట్‌.. | Telangana Government Decided To Privatise TSRTC In Some Routes | Sakshi
Sakshi News home page

రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు రైట్‌ రైట్‌..

Published Sat, Nov 23 2019 2:21 AM | Last Updated on Sat, Nov 23 2019 7:57 AM

Telangana Government Decided To Privatise TSRTC In Some Routes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరించాలని రాష్ట్ర కేబినెట్‌ చేసిన తీర్మానం చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రైవేటు, పెట్టుబడిదారీ విధానాలకు అనుగుణంగా ప్రపంచం పయనిస్తున్న తరుణంలో ఆర్టీసీకి సమాంతరంగా ప్రైవేటు గ్యారేజీలకు అనుమతి ఇవ్వాలనే నిర్ణయం సముచితమేనని పేర్కొంది. రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గ తీర్మానాన్ని సవాల్‌ చేస్తూ ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

వ్యాజ్యంపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం.. కోర్టు సమయం ముగిసిన తర్వాత 45 నిమిషాలపాటు తీర్పును వెలువరించింది. ‘దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు రవాణా వ్యవస్థ కూడా వాటిలోకి వస్తోంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో పోటీతత్వం బాగా ఉంటుంది. పోటీ విధానాన్ని స్వాగతించాలి. తిరస్కరించడం సరికాదు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్‌ 67 (3)కు కేంద్రం ఈ ఏడాది సెప్టెంబర్‌ ఒకటో తేదీన చేసిన సవర ణల ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల రోడ్డు రవాణాకు సమాంతరంగా 50 శాతం మించకుండా ప్రైవేటు ఆపరేటర్లకు అవకాశం ఇచ్చే సర్వాధికారాలు రాష్ట్రాలకు సిద్ధించాయి.

సెక్షన్‌ 102, 67లను కలిపి బేరీజు వేస్తే రాష్ట్రా నికి అధికారాలు ఉన్నాయని తేటతెల్లం అవుతోంది. ఇలా చేయడం ఆర్టీసీకి పోటీగా ప్రైవేటు బస్సు రూట్లను ప్రవేశపెట్టినట్లు  కాదు. ఆ రెండూ సమాంతరంగా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలన్నదే చట్ట సవరణ ఉద్ధేశం. అందుకు లోబడే కేబినెట్‌ నిర్ణయం ఉంది’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. 

కేంద్రమే రాష్ట్రాలకు సర్వాధికారం ఇచ్చింది..  
‘మోటారు వాహనాల చట్టం–1988లోని 67 (3), 102 సెక్షన్ల ప్రకారం రవాణా రూట్లను ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. ఆర్టీసీ గుత్తాధిపత్యం లేకుండా చేసేందుకు, ఆ రవాణా వ్యవస్థకు సమాంతరంగా ఆరోగ్యకర పోటీని ప్రోత్సహించేందుకు వీలుగా ప్రైవేటు గ్యారేజీలకు అనుమతి ఇచ్చే అధికారం కేంద్రం చేసిన చట్ట సవరణ ద్వారా రాష్ట్రానికి వచ్చింది.

అయితే, రూట్ల ప్రైవేటీకరణ 50 శాతానికి మించకూడదు. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో ఉంది. సమ్మె వల్ల రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ కొత్త పుంతలు తొక్కాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా రూట్ల ప్రైవేటీకరణకు వీలుగా కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

ప్రైవేటు ఆపరేటర్లకు ఆస్కారం ఇవ్వడం వల్ల ప్రజలకు మేలే జరుగుతుంది. దురుద్ధేశాలు ఉన్నాయని భావించలేం. అడ్వొకేట్‌ జనరల్‌ వాదించినట్లుగా రాజ్యాంగం ప్రకారమే, సార్వభౌమత్వ విధానాలకు లోబడి న్యాయబద్ధమైన నిర్ణయంగానే దీనిని పరిగణించాలి. కేబినెట్‌ నిర్ణయం గోప్యంగా ఉంచాలని ప్రభుత్వం కోరినందున అందులోని విషయాల్ని తీర్పులో ప్రస్తావించడం లేదు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ పలు సాంకేతిక అభ్యంతరాలను లేవనెత్తారు. చట్టంలోని సెక్షన్లను వేర్వేరుగా విశ్లేషించకుండా అన్ని సెక్షన్లను క్రోడీకరించితే కేబినెట్‌ నిర్ణయం న్యాయబద్ధంగానే ఉంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన కాలంలో రవాణా ఏర్పాట్లు లేక ఆర్టీసీలు ఏర్పాటు జరిగి నేటికీ గుత్తాధిపత్యంతో కొనసాగుతోంది.

ఇప్పుడు ఆర్టీసీకి సమాంతరంగా ప్రైవేటు ఆపరేటర్లకు కూడా అవకాశం ఇవ్వాలనే నిర్ణయం అమల్లోకి వస్తే కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల శ్రీకారం చుట్టినట్లు అవుతుంది’అని హైకోర్టు అభిప్రాయపడింది.  

కేబినెట్‌ తప్పుగా సిఫార్సు చేసింది.. 
మోటార్‌ వాహన చట్టంలోని 102(1)(2) ప్రకారం ఆర్టీసీ గుత్తాధిపత్యాన్ని సరిచేసే అధికారం రాష్ట్రానికి ఉందని.. అయితే ఈ నిర్ణయం ప్రభావం ఉండే ఆర్టీసీ, ఇతర రవాణా సంస్థలకు నోటీసులు ఇచ్చి వాళ్ల వాదనలు తెలుసుకోవాలని ధర్మాసనం సూచించింది. ‘గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి, 30 రోజుల గడువు ఇవ్వాలి. ఎంపిక చేసిన తేదీ/ప్రదేశాల్లో అభ్యంతరాలు స్వీకరించి వాటిపై విచారణ జరిపి పరిష్కరించాలి. అయితే మంత్రివర్గం ప్రైవేటు రూట్ల అంశాన్ని పరిశీలించాలని ఆర్టీసీ కార్పొరేషన్‌ను కోరుతూ తీర్మానం చేసింది. ఇలా చేయడం చట్ట వ్యతిరేకం.

కేబినెట్‌ ఆ ప్రతిపాదనను రవాణా శాఖ ముఖ్యకార్యదర్శికి చేయాలి. ఆర్టీసీ ప్రభుత్వం కాదు.. అది క్వాజీ జ్యుడీషియరీ అథారిటీ మాత్రమే. ప్రభుత్వమే చేయాలంటే ఆ అధికారిని ఉద్ధేశించి కేబినెట్‌ సిఫార్సు చేయాలి. అయితే, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారానే ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని అడ్వొకేట్‌ జనరల్‌ ఇచ్చిన హామీని నమోదు చేశాం. అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉండాలి.

సెక్షన్‌ 102 ప్రకారం కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇది చట్టబద్ధంగానే ఉంది. కాబట్టి మేం జోక్యం చేసుకోవడం లేదు. పిల్‌ను తోసిపుచ్చుతున్నాం. గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’అని ధర్మాసనం తీర్పు చెప్పింది. అయితే, తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని, పది రోజులపాటు తీర్పు అమలును సస్పెన్షన్‌లో ఉంచాలన్న పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. 

కేబినెట్‌ తీర్మానంపై న్యాయసమీక్ష చేయొచ్చు.. 
తొలుత వాదనల సమయంలో.. రాజ్యాంగంలోని 166వ అధికరణం కింద కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోరాదని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. కేబినెట్‌ నిర్ణయం తర్వాత గవర్నర్‌ పేరుతో లేఖ లేదా ఉత్తర్వులు వెలువడినా వాటిని న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదని అధికరణం చెబుతోందని గుర్తు చేసింది. ఈ కేసులో కేబినెట్‌ తీర్మానాన్నే సవాల్‌ చేశారు కాబట్టి న్యాయసమీక్ష చేయవచ్చునని తేల్చి చెప్పింది.

కేబినెట్‌ నిర్ణయం చట్టపరిధిలోనే జరిగిందని ఏజీ చెప్పగానే, ధర్మాసనం కల్పించుకుని.. రూట్ల ప్రైవేటీకరణ వ్యవహారంపై ముందుకు వెళ్లాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కేబినెట్‌ కోరడం తప్పు అని, ఈ ప్రక్రియ నిర్వహించే అధికారం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని, దీని ప్రకారం రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిని కేబినెట్‌ కోరాల్సి ఉంటుందని చెప్పింది. దీంతో ముఖ్య కార్యదర్శి ద్వారానే రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగేలా ప్రభుత్వం చర్యలు ఉంటాయని ఏజీ హామీ ఇచ్చారు.

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న తరుణంలో కేబినెట్‌ రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోవడం విశ్వాసరాహిత్యమే అవుతుందని పిటిషనర్‌ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదించారు. కాగా, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై దాఖలైన మరో ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం ఇంకా విచారించాల్సి ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement