రూట్ల ప్రైవేటీకరణ నోటిఫికేషన్‌కు కసరత్తు  | Officers Ready To Give Notification For TSRTC Routes Privatisation | Sakshi
Sakshi News home page

రూట్ల ప్రైవేటీకరణ నోటిఫికేషన్‌కు కసరత్తు 

Published Sat, Nov 23 2019 2:54 AM | Last Updated on Sat, Nov 23 2019 2:54 AM

Officers Ready To Give Notification For TSRTC Routes Privatisation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్టీసీ నిర్వహిస్తున్న రూట్ల ను ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. రూట్ల ప్రైవేటీకరణను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో, ప్రైవేటు బస్సులకు ఆర్టీసీ రూట్‌ పర్మిట్ల జారీకి రంగం సిద్ధం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ, రవాణా శాఖలు సంయుక్తంగా కొంత కసరత్తు చేశాయి. పలు దఫాలు ముఖ్యమంత్రి వాటిపై సమీక్షించి సానుకూలత వ్యక్తం చేశారు. శనివారం సీఎం వద్ద జరిగే సమీక్షలో దీనిపై చర్చించే అవకాశం ఉంది. ఆయన అంగీకారం తెలపగానే నోటిఫికేషన్‌ జారీ అవుతుంది.

సమ్మెకు ముందు ఆర్టీసీ 3,700 రూట్లలో 10,400 బస్సులు తిప్పు తోంది. రాష్ట్రంలో ఆర్టీసీ మినహా స్టేజ్‌ క్యారియర్లుగా ప్రైవే టు బస్సులకు అనుమతి లేదు. కేవలం టూరిస్టు పర్మిట్ల తోనే ప్రైవేటు బస్సులు తిరగాల్సి ఉంది. కానీ చట్టంలో ఉన్న లొసుగులు, అధికారుల అవినీతి వల్ల చాలాకాలం గా ప్రైవేటు బస్సులు ఆర్టీసీ బస్సుల తరహాలో దూర ప్రాంతాలకు తిరుగుతున్నాయి.  ఇప్పు డు ఆర్టీసీ బస్సుల సంఖ్యను సగానికి తగ్గించి అంతమేర ప్రైవేటు బస్సులు పర్మిట్లు పొంది స్టేజ్‌ క్యారియర్లుగా తిరుగుతాయి. ప్రస్తుతానికి 5,100 బస్సులకు పర్మిట్లు జారీ చేస్తారు. వీటికి సరిపోయేలా దాదాపు 1,800 వరకు రూట్లను అప్పగించే అవకాశం ఉంది.  

నోటిఫికేషన్‌తో షురూ.. 
రాష్ట్రంలో ఉన్న 3,700 రూట్లలో ప్రైవేటుకు అప్పగించే వాటిని తొలుత గుర్తిస్తారు. ఆ రూట్లలో ఎన్ని బస్సులు తిరగాల్సి ఉంటుంది, ఏ కేటగిరీ బస్సులు నడపాలి తదితర వివరాలతో నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలను చెప్పేందుకు నెల రోజుల గడువు ఉం టుంది. అభ్యంతరాల పరిశీలన, మార్పుచేర్పుల అనంతరం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. అనంతరం ప్రైవేటు సంస్థలు దరఖాస్తు చేసుకుంటాయి. వాటిని పరిశీలించాక అర్హమైన వాటిని గుర్తించి ఎంపిక చేస్తారు. 

ఆర్టీసీ కార్మికులను ఏం చేస్తారు?  
ప్రభుత్వం చెబుతున్నట్టుగా 5,100 బస్సులను ప్రైవేటుకు కేటాయిస్తే, ఆర్టీసీలో మిగిలేవి 5,300 బస్సులు. ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం సగటున ఒక బస్సుకు ఆరుగురు సిబ్బంది అవసరమవుతారు. ఆ లెక్కన 5,300 బస్సులకు 31,800 మంది కావాలి. సమ్మెలో 49,300 మంది ఉన్నా రు. వీరిని తిరిగి విధుల్లోకి తీసుకో వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే, అవసరమైనవారు కాకుండా మిగిలిన 17,500 మందిని ఏం చేస్తారన్న ప్రశ్న ఉత్పన్న మవుతోంది. దీనిపై త్వరలో సీఎం నిర్ణయం తీసుకోనున్నారు.

లాభాల రూట్లకే డిమాండ్‌ 
ప్రస్తుతం ఆర్టీసీ నగరంలో తిప్పే సిటీ బస్సులు, గ్రామీణ ప్రాంతాలకు తిప్పే పల్లెవెలుగు బస్సులతో నష్టాలు మూటగట్టుకుంటోంది. ఎక్స్‌ప్రెస్‌ బస్సులు, దూర ప్రాంతాలకు తిరిగే ఇతర బస్సులు మాత్రం లాభాల్లో ఉన్నాయి. సాధారణంగా ప్రైవేటు ఆపరేటర్లు లాభాల్లో ఉన్న రూట్లనే ఎంచుకుంటారు. కానీ వాటితోపాటు నష్టాల రూట్లను కూడా వాటికి అప్పగిస్తామని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ రూట్లు ఏవేవి ఉంటాయనే విషయంలో కసరత్తు జరగాల్సి ఉంది.

ఆదాయం ఎలా?
ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లలోనే ప్రైవేటు బస్సులు తిప్పాల్సి ఉంటుంది. అందుకు చార్జీలను కూడా ఆర్టీసీ రూపొందించిన వాటినే అమలు చేయాలి. ఆర్టీసీ బస్సులు, ఈ ప్రైవేటు బస్సుల చార్జీలు ఒకే రకంగా ఉండాలి. చార్జీల రూపంలో వచ్చే ఆదాయాన్ని ప్రైవేటు సంస్థలే తీసుకుంటాయి. పర్మిట్లు పొందేందుకు ప్రైవేటు బస్సుల నిర్వాహకులు చెల్లించే మొత్తం ప్రభుత్వానికి ఆదాయంగా ఉంటుంది. ప్రస్తుతం టూరిస్టు పర్మిట్లకు ఒక్కో బస్సుకు ప్రతి సీటుకు నిర్ధారిత మొత్తాన్ని రవాణాశాఖ వసూలు చేస్తోంది. ప్రతి మూడు నెలలకోమారు ఆ మొత్తాన్ని చెల్లించాలి.

అది ఒక్కో బస్సుకు దాదాపు రూ.3.5 లక్షల వరకు ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో స్టేజ్‌ క్యారియర్‌ పర్మిట్లకు కూడా రవాణాశాఖ వసూలు చేస్తుంది. అయితే ఆ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతోపాటు త్రైమాసికంగా కాకుండా ప్రతి నెలా చెల్లించేలా మార్చాలని భావిస్తోంది. ఈ విషయం ఇంకా ఖరారు కాలేదు. నెలకోమారు ఉండాలా లేక సంవత్సరానికి ఒకేసారి చెల్లించాలా అన్న విషయంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రితో జరిగే సమీక్షలో దీనిపై స్పష్టత రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement