సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు ప్రభుత్వం ఓకే చెప్పింది. మూడేళ్లుగా స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఇవ్వాలంటూ యాజమాన్యాలు చేస్తున్న విజ్ఞప్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 14 నుంచి స్పాట్ అడ్మిషన్లు చేపట్టుకోవచ్చని యాజమాన్యాలకు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ప్రకటించారు. దోస్త్ కౌన్సెలింగ్ తర్వాత స్పాట్ ప్రవేశాలకు అవకాశం లేకపోవడంతో మిగిలిపోయే సీట్లలో యాజమాన్యాలు సొంతంగా ప్రవేశాలు చేపట్టే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం ఏటా మంత్రులను కలసి విజ్ఞప్తులు చేస్తూనే ఉంది. ఈ ఏడాది కూడా విద్యా శాఖ మంత్రిని, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను కలసి కలిసి విజ్ఞప్తులు చేసింది. దీంతో ఎట్టకేలకు స్పాట్ అడ్మిషన్లకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో దోస్త్ కౌన్సెలింగ్ తర్వాత మిగిలిపోయే సీట్లలో తాము కోరుకునే కాలేజీల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు వీలు ఏర్పడిందని డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి పరమేశ్ పేర్కొన్నారు
ఆర్థిక స్థోమత కలిగిన విద్యార్థులకు దోస్త్ ద్వారా కోరుకున్న కాలేజీల్లో సీట్లు రావట్లేదని, స్పాట్ అడ్మిషన్ల ద్వారా అలాంటి వారికి కోరుకున్న చోట సీట్లు లభిస్తాయని వివరించారు. కాగా, రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కౌన్సెలింగ్ ద్వారా చేపట్టే ప్రవేశాలు పోగా మరో 1.76 లక్షల సీట్లు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో యాజమాన్యాల ఆధ్వర్యంలో ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను ఈ నెల 14 నుంచి 18 వరకు చేపట్టి పూర్తి చేయాలని లింబాద్రి వెల్లడించారు. ప్రవేశాలను పూర్తి చేసి, విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా కాలేజీల్లో చేరే విద్యార్థులు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని వివరించారు.
నేడు స్పెషల్ రౌండ్ సీట్ల కేటాయింపు
ఇప్పటి వరకు ఐదు దశల్లో చేపట్టిన డిగ్రీ కౌన్సెలింగ్ ద్వారా 1,74,239 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరారు. అయితే విద్యార్థుల నుంచి వచి్చన విజ్ఞప్తుల మేరకు దోస్త్ మరో విడత కౌన్సెలింగ్‌ను స్పెషల్ రౌండ్ పేరుతో ఈ నెల 9 నుంచి 13 వరకు నిర్వహించింది. ఇందులో 6,997 మంది విద్యార్థులు డిగ్రీ ప్రవేశాల కోసం కొత్తగా రిజి్రస్టేషన్ చేసుకున్నారు. వారితో పాటు గతంలో తమ మార్కులకు అనుగుణంగా సరిపడా వెబ్ ఆప్షన్లు ఇవ్వకపోవడంతో సీట్లు రాని వారు, సీట్లు వచి్చనా కాలేజీల్లో రిపోర్ట్ చేయని వారు కలిపి మొత్తం 16 వేల మంది విద్యార్థులు తాజాగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారికి ఈ నెల 14న సీట్లు కేటాయిస్తామని లింబాద్రి వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15, 16 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. ప్రైవేటు కాలేజీలతో పాటు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, దోస్త్ పరిధిలో లేకుండా సొంతంగా ప్రవేశాలు చేపట్టిన కాలేజీలన్నీ విద్యార్థుల సమగ్ర వివరాలను ఈనెల 18 లోగా అందజేయాలని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment