సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు ఒక్కొక్కటిగా ఇంగ్లిషు మీడియం వైపు మళ్లుతున్నాయి. ఏటా ఒక్కో తరగతి చొప్పున ఇంగ్లిషు మీడియంలోకి మారుతున్నాయి. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా మీడియం మార్పునకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతోంది. జిల్లాల్లో ఇంగ్లిషు మీడియం ప్రారంభించేందుకు అనేక పాఠశాలలు సిద్ధంగా ఉన్నా సాంకేతిక సమస్యలు, ప్రభుత్వ అనుమతి వంటి కారణాలతో జాప్యం జరుగుతోంది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) తీర్మానం చేసి పంపితే చాలు మీడియం మార్పునకు ఓకే చెప్పాలని నిర్ణయించింది. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిషు మీడియంలోకి మార్చుతామని తెలిపింది. మీడియం మార్పు ఫైలు ప్రభుత్వానికి రావాల్సిన అవసరం లేకుండా జిల్లాల్లో డీఈవోల స్థాయిలోనే ఆమోదం తెలపాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పాఠశాల విద్యా శాఖ సిద్ధం చేసింది. అవి ప్రభుత్వ ఆమోదం తర్వాత అమల్లోకి రానున్నాయి. దీంతో ఇక తెలుగు మీడి యం స్కూళ్లు ఇంగ్లిషు మీడియంలోకి మారడం మరింత సులభతరం కానుంది.
ప్రభుత్వ స్కూళ్లలో..
రాష్ట్రంలో 40,597 పాఠశాలలున్నాయి. అందులో ప్రభుత్వ పాఠశాలలు 26,754 ఉండగా, ప్రైవేటు స్కూళ్లు 10,549 ఉన్నాయి. మిగతావి ఎయిడెడ్, గురుకులాలు, కేంద్రీయ విద్యాలయాలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 5 వేల వరకు ఉన్నత పాఠశాలలుండగా, అందులో సగం స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం కొనసాగుతోంది. మరోవైపు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ ఇంగ్లిషు మీడియం కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకొని ఇప్పటికే చాలా స్కూళ్లను తెలుగు మీడియం నుంచి ఇంగ్లిషు మీడియానికి మార్పు చేశారు. అందులో కొన్నింటికి మీడియం మార్పుపై అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది.
ప్రభుత్వం డీఈవోలకే అధికారం ఇచ్చేలా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మీడియం మార్పు సులభతరం కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 37.82 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిషు మీడియంలోనే చదువుతుండగా, 57.46 శాతం మంది విద్యార్థులు తెలుగు మీడియం చదువుకుంటున్నారు. మరో 4.72 శాతం మంది విద్యార్థులు ఇతర మీడియంలలో చదువుకుంటున్నారు. ఇక ప్రైవేటు పాఠశాలల్లో 96.94 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిషు మీడియంలోనే చదువుకుంటుండగా, 2.06 శాతం మంది తెలుగు మీడియంలో చదువుకుంటున్నారు. మిగతా ఒక్క శాతం ఇతర మీడియం విద్యార్థులున్నారు.
ఆసక్తి, సదుపాయాలు, తీర్మానమే కీలకం
ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లలో కొంతమందే ఇంగ్లిషు మీడియం చదువుకున్నా, అనేకమంది ఉపాధ్యాయ విద్యను ఇంగ్లిషు మీడియంలోనే పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో ఇంగ్లిషు మీడియంలో బోధన పెద్ద సమస్య కాబోదన్నది ఉపాధ్యాయుల వాదన. పైగా ఇంగ్లిషు మీడియం బోధించే టీచర్లకు ప్రభుత్వం కూడా శిక్షణ ఇస్తోంది. ఈ నేపథ్యంలో తమ పాఠశాలల్లో తాము ఇంగ్లిషు మీడియంలో బోధిస్తామని టీచర్లు ముందుకొస్తే, ఆయా పాఠశాలల్లో సరిపడా టీచర్లుంటే.. తల్లిదండ్రులు ఇంగ్లిషు మీడియం కోరుకుంటే.. ఆ పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ ఒక్క తీర్మానం చేసి పంపిస్తే చాలు.. ఆ పాఠశాలను ఇంగ్లిషు మీడియంలోకి మార్చేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అయితే అన్నింటికి ఒకేసారి కాకుండా ఒక్కో తరగతి వారీగా మార్పునకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇక మీడియం బదలాయింపు అధికారాన్ని డీఈవోలకు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడితే జిల్లా స్థాయిలోనే మీడియం మార్పు జరిగిపోనుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో...
తెలుగు మీడియం: 15,44,208 (57.46%)
ఇంగ్లిష్ మీడియం:10,16,334 (37.82%)
అన్ని మీడియాలు: 26,87,563
ప్రైవేటు పాఠశాలల్లో ...
64,315 (2.06%)
30,27,459 (96.94%)
31,22,927
Comments
Please login to add a commentAdd a comment