ఇంటికొక్కటే!
సామాజిక పింఛన్లపై టీ సర్కార్ యోచన
సాక్షి, హైదరాబాద్:
పింఛన్ల కింద చెల్లిస్తున్న మొత్తాన్ని భారీగా పెంచుతుండడంతో.. అర్హులకు మాత్రమే పెన్షన్లు అందేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే సామాజిక పింఛన్ ఇవ్వాలని యోచిస్తోంది. కొన్నిచోట్ల ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పెన్షన్ పొందుతుండడం.. ఉద్యోగుల తల్లిదండ్రులు, అంగన్‌వాడీ వర్కర్లుగా ఉన్నవారూ పింఛన్ తీసుకుంటున్నట్లు వెల్లడైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్తగా తెలంగాణ ప్రభుత్వ లోగోతో కార్డులు పంపిణీ చేయనున్న సమయంలోనే.. జల్లెడ పట్టి అనర్హులను తొలగించనుంది. అర్హులకు మాత్రమే సామాజిక పింఛన్లు అందాలన్న ఉద్దేశంతో.. తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల పథకంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగా ఇంటిలో ఒకరికి మాత్రమే సామాజిక పెన్షన్ ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న వారికి ఆధార్‌కార్డు ఉంటేనే పెన్షన్ ఇవ్వాలని.. లేనిపక్షంలో ఇవ్వొద్దని స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. పెన్షన్లను విధిగా ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయడంతో పాటు బ్యాంకు ఖాతాలను కూడా తప్పనిసరి చేస్తున్నారు. ప్రస్తుతం వృద్ధాప్య, వితంతు, చేనేత, గీత కార్మికులు, అంగ వైకల్యం కేటగిరీల కింద 30.87 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లను అందజేస్తున్నారు. అయితే ఇందులో ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురికిపైగా పెన్షన్లు పొందుతున్నట్లు అధికారుల సర్వేల్లో వెల్లడైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటికి ఒకే పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
అయితే అంగవైకల్యం ఉన్నవారికి మాత్రం ఇంట్లో ఇంకెవరు పొందుతున్నా కూడా.. పెన్షన్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక అంగన్‌వాడీల్లో వర్కర్లుగా పనిచేస్తున్న వితంతువులు... వర్కర్‌గా వేతనాలు తీసుకుంటూనే, వితంతు పెన్షన్ కూడా పొందుతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఉద్యోగాలు చేస్తున్నవారి తల్లిదండ్రులు కూడా వృద్ధాప్య పింఛన్లను పొందుతున్నారని.. అంతేగాకుండా ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు వృద్ధులు ఉంటే వారందరికీ పెన్షన్లు మంజూరు అవుతున్నాయని పేర్కొంటున్నాయి. ఇలా కాకుండా ఒక్కరికి మాత్రమే ఈ పెన్షన్ మంజూరు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఓ అధికారి వివరించారు. అయితే ఈ ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు సంబంధించి ఎవరి ఆర్థిక, సామాజిక పరిస్థితి వారికి ఉంటుందని.. అర్హత కలిగిన వారికి ఇవ్వాలనే మౌలిక సూత్రాన్ని పట్టించుకోకుండా ఒకరికి మాత్రమే పెన్షన్ అమలు చేస్తామనడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొత్త కార్డులతో షురూ..!
దసరా-దీపావళి నాటికి పింఛన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వ లోగోతో కొత్త కార్డులను పంపిణీ చేసే సమయంలోనే.. ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురికి అందుతున్న పెన్షన్లను జల్లెడ పట్టనున్నట్లు ప్రభుత్వవర్గాలు వివరించాయి. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికలకు నెలకు రూ. 200, వికలాంగులకు రూ. 500 చొప్పున పింఛన్లను చెల్లిస్తున్నారు. ప్రస్తుత పెన్షన్ల ప్రకారం ప్రభుత్వానికి ఏటా రూ. 872 కోట్ల భారం పడుతుండగా.. అందులో రూ. 272 కోట్ల వరకు కేంద్రం భరిస్తోంది. అయితే ఈ పెన్షన్లను వికలాంగులకు రూ. 1,500కి, మిగతావారికి రూ. వెయ్యికి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో... ఈ భారం రూ. 3,900కోట్లకు చేరుకుంటుందని అధికారుల అంచనా. దీంతో నిజంగా అర్హులకు మాత్రమే పింఛన్లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పింఛన్ల పథకంలో భరీగా అవినీతి చోటు చేసుకుంటోందని.. దానిని అరికట్టాల్సి ఉందని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించడం గమనార్హం.