ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఔట్‌పేషెంట్ (ఓపీ) సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పచ్చజెండా ఊపారు. ఆ మేరకు జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు కరోనా నియంత్రణ రాష్ట్ర ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడొకరు తెలిపారు. కరోనా చికిత్స అందించే 8 ప్రభుత్వ ఆసుపత్రులు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలను ప్రారంభించొచ్చని, ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవని ఆయన పేర్కొన్నారు.
జిల్లా అధికారులతోనే తంటా!
కరోనా నేపథ్యంలో ఔట్‌పేషెంట్ల తాకిడి వల్ల వైరస్ మరింత విస్తరిస్తుందని, అందువల్ల అత్యవసర కేసులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని వైద్యఆరోగ్యశాఖ గతంలో ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఔట్‌పేషెంట్ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. ప్రాణాపాయ కేసులను కూడా కొన్ని ఆసుపత్రులు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పిల్లలు, పెద్దలకు ఏదైనా జబ్బుచేస్తే పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. చిన్న పిల్లలకు జ్వరం వచ్చినా చూపించే పరిస్థితి లేకపోవడంతో తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితిని గమనించి వైద్య ఆరోగ్యశాఖ ఓపీ సేవలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, జిల్లా అధికారులు, కొందరు కలెక్టర్లు ఈ ఆదేశాల అమలుకు భయపడుతున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఓపీ సేవలు ప్రారంభిస్తే జనం తాకిడి పెరుగుతుందని, దీంతో కరోనా విజృంభిస్తుందన్న భావనతో కొందరు కలెక్టర్లు ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే నిర్ణీత సమయం మేరకు కొన్ని నిబంధనలతో ఓపీ సేవలను అమలుచేయాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
వెనక్కి తగ్గుతున్న యాజమాన్యాలు
వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఆదేశాలొచ్చినట్టు తెలిసినా, జిల్లా అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఆసుపత్రులు తెరవలేకపోతున్నామని హైదరాబాద్‌కు చెందిన ఓ కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. మంత్రి ఈటల పచ్చజెండా ఊపినట్టు తాము మీడియాలో చూశామని, కానీ జిల్లా అధికారులు తమను ప్రోత్సహించడం లేదని ఖమ్మం జిల్లాకు చెందిన మరో డాక్టర్ అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే ప్రైవేటు క్లినిక్‌లు, నర్సింగ్ హోంలు నడిపే కొందరు డాక్టర్లు ఓపీ చూడడానికి ముందుకు రావడంలేదన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఓపీ పేషెంట్లలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే తమకు అంటుకుంటుందన్న భయం వారిలో నెలకొంది.
జలుబు, జ్వరం, దగ్గుతో అత్యవసర కేసుల కింద ఆసుపత్రులకు ఎవరైనా వస్తే కొన్నిచోట్ల లోపలికి కూడా రానివ్వడం లేదని కొందరు రోగులు ఆరోపిస్తున్నారు. ‘గాంధీ ఆసుపత్రికి వెళ్లి కరోనా నెగెటివ్ ఉన్నట్టు సర్టిఫికెట్ తెప్పించుకుంటే అప్పుడు ఇతరత్రా వైద్యం చేస్తామని కొందరు డాక్టర్లు అంటున్నార’ని శ్రీగణేష్ అనే బాధితుడు తెలిపారు. ఏదేమైనా ఓపీ సేవలు ప్రారంభించకపోతే సాధారణ రోగులకు ఇబ్బందులు కలుగుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ తమ ఆదేశాలను అమలు చేయాలని జిల్లా అధికారులకు స్పష్టంగా చెప్పాలని పలు ఆసుపత్రి యాజమాన్యాలు కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment