
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఐటీ అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లాలు మాత్రమే. ఇప్పుడు ఆదిభట్లలోనూ పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి మారి నగరం చుట్టూ ఐటీ విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఐటీశాఖ చర్యలు తీసుకుంటోంది. శివారు ప్రాంతాలకు సైతం విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీ శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఇప్పటికే ఆదిభట్లలో టీసీఎస్ సహా ఇతర ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయని.. ఇదే స్ఫూర్తితో శంషాబాద్, మహేశ్వరం ప్రాంతాల్లోనూ ఐటీ కంపెనీలు నెలకొల్పేందుకు ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపాయి. కాగా, ఐటీ ఎగుమతుల విషయంలో జాతీయ సగటు తొమ్మిది శాతంతో పోలిస్తే తెలంగాణ ఐటీ ఎగుమతులు 17 శాతం అధికంగా ఉన్నాయన్నాయి. నూతన ఐటీ కంపెనీల ఏర్పాటుతో ఉపాధి కల్పనకు ఊతమివ్వడంతోపాటు ఆయా ప్రాంతాల సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపాయి. ఐటీ ఎగుమతుల్లో దక్షిణాదిలో బెంగళూరు తర్వాత రెండోస్థానంలో గ్రేటర్ హైదరాబాద్ నగరం నిలిచినట్లు పేర్కొన్నాయి.
టైర్–2 నగరాల్లోనూ ఐటీకి బాటలు..
గ్రేటర్ శివార్లతోపాటు రాష్ట్రంలోని ఇతర టైర్–2 నగరాల్లోనూ ఐటీ టవర్స్‌ను నిర్మించి పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లోనూ ఐటీ టవర్స్‌ను నిర్మించి.. వాటిల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రక్రియ ఈ ఏడాది చివరిలో ప్రారంభమౌతుందన్నారు.
గ్రేటర్‌లో ఉపాధి ఇలా...
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన కంపెనీల్లో 50 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. టీఎస్ ఐపాస్ రాకతో గత కొన్నేళ్లుగా బుద్వేల్, ఆదిభట్ల తదితర ప్రాంతాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు సుమారు 30 కంపెనీలు దరఖాస్తు చేశాయన్నారు. కాగా గ్రేటర్ కేంద్రంగా సుమారు 647 ఐటీ కంపెనీల బ్రాంచీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆయా కంపెనీల్లో సుమారు 6 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఐసీటీ, హార్డ్‌వేర్ పాలసీలతోపాటు ఇమేజ్ పాలసీ, ఇన్నోవేషన్ (స్టార్టప్) పాలసీ, డ్రోన్ పాలసీ, సైబర్ సెక్యూరిటీ పాలసీలు ఐటీ రంగం వృద్ధికి దోహదం చేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా తెలంగాణ ఐటీ ఎగుమతులు గతేడాది రూ.1.09 లక్షల కోట్లమేర ఉన్నాయని తెలిపాయి.
గత కొన్నేళ్లుగా గ్రేటర్ నుంచి ఐటీ ఎగుమతులు ( రూ. కోట్లలో)
Comments
Please login to add a commentAdd a comment