అత్యాధునికంగా సచివాలయం
► బైసన్‌పోలో గ్రౌండ్స్‌లో రూ.300 కోట్లతో మూడు అంతస్తుల్లో: తుమ్మల
►మొదటి అంతస్తులో ఒకవైపు సీఎం, మరోవైపు సీఎస్ కార్యాలయాలు
►రెండు, మూడో అంతస్తుల్లో కార్యదర్శులు, ఉన్నతాధికారుల కార్యాలయాలు
►ప్రతిపక్షాలు కాకిగోల ఆపాలంటూ మండిపడ్డ ఆర్ అండ్ బీ మంత్రి
సాక్షి,ప్రతినిధి ఖమ్మం: ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా బైసన్ పోలో గ్రౌండ్స్‌లో రూ.300 కోట్లతో నూతన సచివాలయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. ప్రస్తుత సచివాలయం పాలనా అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేకపోతోందన్నారు. కొత్త సచివాలయంలో మూడు ఫ్లోర్‌లు ఉంటాయని, మొదటి ఫ్లోర్‌లో ఒకవైపు సీఎం కార్యాలయం.. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఉంటుందని చెప్పారు.
రెండో ఫ్లోర్‌లో ప్రభుత్వ శాఖల కార్యదర్శులు ఉంటారని, మూడో ఫ్లోర్‌లో ప్రభుత్వ శాఖల ప్రధాన అధికారులు ఉంటారని తెలిపారు. బుధవారం ఖమ్మంలోని టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయం లో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భం గా కొత్త సచివాలయ నమూనాను విడుదల చేశారు. ‘‘రక్షణ శాఖ పరిధిలో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం అనేకమార్లు కేంద్రంతో చర్చలు జరిపింది. పట్టుబట్టి సాధించుకున్నాం. దీనికి బదులుగా కేంద్రానికి రూ.95 కోట్ల నగదుతోపాటు వారు కోరుకున్నచోట 596 ఎకరాల స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 38 ఎకరాల బైసన్ పోలో గ్రౌండ్స్‌లో ఆధునిక హంగులతో సచివాలయాన్ని నిర్మిస్తాం’’ అని వివరించారు.
ప్రతిపక్షాలది కాకిగోల.. రాద్ధాంతం..
ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాద్ధాంతం చేస్తూ రాజకీయ ప్రయోజనం కోసం పాకులాడు తున్నాయని, ఇప్పటికైనా కాకిగోల ఆపాలంటూ తుమ్మల మండిపడ్డారు. ‘‘సచివాలయాన్ని కూడా కట్టనివ్వబోమంటూ శపథాలు చేస్తున్నారు. పనులను అడ్డుకుని నిర్మాణాలను ఆలస్యం చేయ గలుగుతారేమో కానీ.. వాటిని ఆపే శక్తి ప్రతి పక్షాలకు లేదు. అభివృద్ధిని ఎవరు అడ్డుకున్నా ప్రజలు సహించే పరిస్థితిలో లేరు. ఇప్పుడున్న సచివాలయంలో ఏ సమావేశం నిర్వహించాలన్నా ఇబ్బంది కలుగు తోంది.
కలెక్టర్ల సదస్సు, కేబినెట్ సమావేశాలను హోటళ్లను అద్దెకు తీసుకుని నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొత్త సచివాలయంలో ఆధునిక హంగులతో పూర్తిస్థాయి సమావేశ మందిరాన్ని నిర్మిస్తాం’’ అని తెలిపారు. కాళేశ్వరం, భద్రాద్రి పవర్ ప్లాంట్, యాదాద్రి నిర్మాణాలను ఆపేందుకు యత్నించి ప్రతిపక్షాలు విఫలమయ్యాయన్నారు.