గవర్నర్‌కు అధికారాలపై టీ-సర్కారు సీరియస్
Published Wed, Jul 9 2014 2:24 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
సాక్షి, హైదరాబాద్: గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించేందుకు కేంద్రం చేస్తున్న యత్నాలను తెలంగాణ సర్కారు సీరియస్‌గా తీసుకుంది. ఉమ్మడి రాజధానిలో గవర్నర్ పెత్తనానికి అంగీకరించే ప్రసక్తే లేదని, ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్లాలని పట్టుదలగా ఉంది. కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకువెళితే.. రాజకీయ పోరాటంతో పాటు న్యాయపోరాటానికీ సిద్ధం కావాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది.
విభజన చట్టంలోని సెక్షన్ 8లో పేర్కొన్న అంశాల మేరకు నిబంధనలు పాటించడానికి తమకు అభ్యంతరం లేదని, అంతకు మించి అధికారాలు కల్పించే యత్నం చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన బిజినెస్ రూల్స్ మార్పునకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశాయి. కేంద్రం పంపిన సర్క్యులర్‌కు న్యాయ, హోం, రోడ్లు, భవనాలు, పురపాలక శాఖల నుంచి పూర్తిస్థాయి సమాచారం తీసుకున్నాకే సమాధానం పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. విభజన చట్టం సెక్షన్ 8లోని మూడో పేరాలో పేర్కొన్న ప్రకారం ‘తెలంగాణ మంత్రివర్గాన్ని సంప్రదించిన తర్వాత గవర్నర్ తన అధికారాలను వినియోగించాలి. వ్యక్తిగత నిర్ణయాలను అమలు చేయాలి.
ఏవైనా అభ్యంతరాలు వచ్చిన పక్షంలో.. గవర్నర్ విచక్షణాధికారమే తుది నిర్ణయం అవుతుంది. గవర్నర్ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరు’ అన్న నిబంధనను అడ్డంపెట్టుకుని రాష్ట్ర బిజినెస్ రూల్స్‌లో మార్పులు చేయాలని సూచించడం వెనుక మరేదైనా ఉద్దేశం ఉందేమోనన్న అనుమానాన్ని తెలంగాణ అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం నుంచి వచ్చిన సర్క్యులర్‌ను సాధారణ ప్రక్రియలో భాగంగా పంపించారా? లేక కేంద్ర హోం మంత్రి అనుమతి తీసుకుని పంపించారా? అన్న విషయంలోనూ రాష్ర్ట ప్రభుత్వం కూపీ లాగుతోంది.
హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగమైనప్పుడు ఉమ్మడి పోలీసింగ్‌కు అవకాశం ఎలా కల్పిస్తారని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయంలో కేంద్రం కేవలం రాష్ర్ట ప్రభుత్వ అభిప్రాయం కోరినందున, ఆ మేరకు రాజ్యాంగ, చట్టపరమైన అంశాలతోపాటు న్యాయపరంగా అధ్యయనం చేశాకే గట్టి సమాధానం పంపినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ సర్క్యులర్‌ను ముందుగా కేంద్ర ప్రభుత్వం ఇ-మెయిల్ రూపంలో పంపిస్తే.. దాన్ని తిరస్కరించామని, లిఖితపూర్వకంగా పంపితేనే సమాధానం ఇస్తామని తెలియజేసినట్లు ఆయన వెల్లడించారు.
Advertisement