రంగంలోకి కేసీఆర్‌ | Telangana Govt Focus On Mallanna Sagar Project | Sakshi
Sakshi News home page

రంగంలోకి కేసీఆర్‌

Published Sun, Jul 23 2017 1:55 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

రంగంలోకి కేసీఆర్‌ - Sakshi

రంగంలోకి కేసీఆర్‌

‘మల్లన్నసాగర్‌’ పెండింగ్‌ భూసేకరణపై దృష్టి
మిగిలిపోయిన 1,250 ఎకరాల కోసం నిర్వాసితులతో సీఎం సమావేశం
ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో నాలుగు గంటల పాటు చర్చలు
ఆదుకుంటాం.. సహకరించాలంటూ సీఎం విజ్ఞప్తి
ఉపాధి అవకాశాలు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు
రెండు పంటలు పండే భూములకు ప్రత్యేక పరిహారం ఇస్తామని హామీ


గజ్వేల్‌ : జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారిన ‘మల్లన్నసాగర్‌’వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు రంగంలోకి దిగారు. పెం డింగ్‌లోని 1,250 ఎకరాల భూములను సేకరించి ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమం చేసే యత్నం మొదలుపెట్టారు. అందులోభాగంగా శనివారం ‘మల్లన్నసాగర్‌’ముంపు గ్రామం వేములఘాట్‌ నిర్వాసితులను సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు ఆహ్వానించి చర్చించారు.

ఏడాదిగా పెండింగ్‌
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలం వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్, తొగుట, కొండపాక మండలం ఎర్రవల్లి, సింగారం పంచాయతీల పరిధిలో 17,430 ఎకరాల భూమి అవసరం. ఇందులో 2,500 ఎకరాలు అటవీభూమి కాగా.. మిగతా భూమి అంతా రైతులదే. మంత్రి హరీశ్‌రావు పలుమార్లు ముంపు గ్రామాల ప్రజలతో సమావేశమై 95 శాతానికిపైగా భూసేకరణను పూర్తి చేయించారు. ఇంకా వేములఘాట్‌ గ్రామంలో 1,150 ఎకరాలు, ఏటిగడ్డ కిష్టాపూర్‌లో 50, తొగుటలో మరో 50 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ముఖ్యంగా వేములఘాట్‌ గ్రామస్తులు భూసేకరణను నిరసిస్తూ, పలు డిమాండ్లతో 410 రోజులుగా దీక్షలు చేస్తున్నారు.

ఆదుకుంటాం.. సహకరించండి!
మల్లన్నసాగర్‌ నిర్వాసితులతో సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో సీఎం కేసీఆర్‌ పలు హామీలు ఇచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వం తరఫున స్వయం ఉపాధి, కులవృత్తులకు ఉపాధి కల్పిస్తామని.. గేదెలు అందజేస్తామని, డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని గ్రామానికి పంపి రెండు పంటలు పండే భూముల వివరాలతోపాటు పూర్తి స్థాయిలో ఇతర సమాచారాన్ని సేకరిస్తామని.. 2 పంటలు పండే భూముల నిర్వాసితులను ప్రత్యే కంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చినట్లు తెలిసిం ది.

దశాబ్దాలుగా నీటి గోసతో అల్లాడుతున్న తెలం గాణ సస్యశ్యామలం కావాలంటే ప్రాజెక్టుల నిర్మాణ మే శరణ్యమని.. ‘మల్లన్నసాగర్‌’నిర్మాణానికి సహక రించాలని సీఎం కేసీఆర్‌ కోరినట్లు సమాచారం. బాధితులను ఆదుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారని.. ఇక ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేస్తా మని, అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. కాగా మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులతో సీఎం భేటీ కావడంతో ఫామ్‌హౌస్‌ చుట్టూ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భూనిర్వాసి తులను ఫామ్‌హౌస్‌ గేటు వద్ద క్షుణ్నంగా తనిఖీ చేసి లోపలికి పంపించారు.

నేరుగా సీఎం చర్చలు
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో నిర్మిస్తున్న ‘కొండపోచమ్మ సాగర్‌’రిజర్వాయర్‌ భూసేకరణ విషయంగా కూడా నిర్వాసితులు తొలుత ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో సీఎం కేసీఆర్‌ స్వయంగా చొరవ తీసుకుని నిర్వాసితు లతో నేరుగా చర్చలు జరిపారు. ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న ‘మల్లన్నసాగర్‌’ వ్యవహారంపై దృష్టి సారించారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితులను శనివారం చర్చలకు ఆహ్వానిం చారు. దీంతో వేములఘాట్‌ గ్రామానికి చెందిన వంద మందికిపైగా రైతులు, ఏటిగడ్డ కిష్టాపూర్‌ నుంచి కొందరు రైతులు వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలైన చర్చలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగాయి. సీఎంతోపాటు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, గజ్వేల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రత్యేకాధికారి హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి తదితరులు కూడా చర్చల్లో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement