సర్పంచ్‌ ఎన్నిక.. ప్రత్యక్షంగానే! | Telangana Govt Step back On Sarpanch Elections | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ ఎన్నిక.. ప్రత్యక్షంగానే!

Published Mon, Mar 26 2018 1:48 AM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

Telangana Govt Step back On Sarpanch Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో సర్పంచ్‌ ఎన్నికలను ఇప్పుడున్నట్లుగానే ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త పంచాయతీ చట్టం రూపకల్పన సందర్భంగా సర్పంచ్‌ ఎన్నికలను పరోక్షంగా నిర్వహించే అంశంపై ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. ముఖ్యమంత్రి సూచనల మేరకు వివిధ మార్గాలను పరిశీలించింది. అదే సమయంలో పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పుచేర్పులు చేయడానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. పలుమార్లు సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం వివిధ సంస్థలు, నిపుణులతో చర్చించిన తర్వాత తుది నివేదికను ముఖ్యమంత్రికి అందించింది.

ఈ నివేదిక ప్రకారం పరోక్ష పద్ధతిలో సర్పంచ్‌ ఎన్నికలను నిర్వహించాలనే యోచనకు ప్రభుత్వం స్వస్తిపలికినట్లు తెలుస్తోంది. వార్డు సభ్యులను నేరుగా ఎన్నుకోవడం, ఎన్నికైన వార్డు సభ్యులతో సర్పంచ్‌ను చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకోవాలనే ప్రతిపాదన మంత్రివర్గ ఉపసంఘం ముందుకు వచ్చింది. ఇద్దరు సభ్యులను ప్రభుత్వం నామినేట్‌ చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చింది.అయితే పరోక్ష ఎన్నికపై పలు విమర్శలు రావడం, పంచాయతీరాజ్‌రంగ నిపుణులు కూడా ఈ విధానాన్ని వ్యతిరేకించడం వంటి కారణాలతో దీన్ని విరమించుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పరోక్ష పద్ధతిలో అయితే వార్డు సభ్యులను కాపాడుకోవడంతోనే పదవీకాలం గడిచిపోతుందని, అభివృద్ధి పనులపై దృష్టిపెట్టే అవకాశం కూడా సర్పంచ్‌లకు లేకుండా పోతుందని పలువురు అభిప్రాయపడ్డారు. 

రిజర్వేషన్‌ విధానంలో మార్పులు... 
సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు రొటేషన్‌ పద్ధతిపై ఐదేళ్లకోసారి రిజర్వేషన్‌ను మార్చేలా ప్రస్తుతమున్న విధానంలో మార్పులకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇప్పుడు ఖరారు చేసే రిజర్వేషన్‌నే రెండో విడతకు..అంటే పదేళ్లపాటు పొడిగించాలనే ప్రతిపాదనకు మొగ్గు చూపింది. కొత్తగా పంచాయతీలు ఏర్పడటం, తండాలు, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు వీలుగా చట్టంలో మార్పులు చేయనున్నారు. నియోజకవర్గాలవారీగా కొత్తగా ఏర్పాటు చేయాల్సిన గ్రామ పంచాయతీలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో జిల్లాల ఇన్‌చార్జ్‌ మంత్రులు ఇటీవలే సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యేల ప్రతిపాదనలను జిల్లాల ఇన్‌చార్జ్‌ మంత్రులు ముఖ్యమంత్రికి అందించారు. దీనికి అనుగుణంగానే పంచాయతీరాజ్‌ బిల్లులో మార్పుచేర్పులు చేశారు. అయితే కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈసారి వచ్చిన రిజర్వేషన్‌ను పదేళ్లపాటు అంటే రెండు పదవీకాలాలపాటు వరుసగా కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. దీంతోపాటు పంచాయతీకి ఇద్దరు నిపుణులను సభ్యులుగా నామినేట్‌ చేయాలనే నిర్ణయాన్ని కూడా చేసినట్లు తెలుస్తోంది.  

మున్సిపల్‌ చట్ట సవరణ... 
ప్రస్తుతమున్న మున్సిపల్‌ చట్టానికి సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు తప్పనిసరిగా గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల కోర్టు కేసులతో మున్సిపాలిటీల అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ ఆగిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ప్రస్తుతమున్న చట్టానికి సవరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. 

రేపు కేబినేట్‌ భేటీ... 
కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లులను ఆమోదించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా భేటీ కానుంది. మంగళవారం ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీరెండు గంటల వ్యవధిలో అసెంబ్లీలోనే మంత్రివర్గ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement